ఇరాన్ లో ఆ కీలక ఐలాండ్ ను ట్రంప్ ఎందుకు వదిలేశాడు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు అమెరికా–ఇజ్రాయెల్ కూటమి.. మరోవైపు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.;
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు అమెరికా–ఇజ్రాయెల్ కూటమి.. మరోవైపు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అల్బోర్జ్ ప్రాంతంలోని పలు చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ దాడుల వల్ల పలు ప్రాంతాల్లో భారీగా పొగలు కమ్ముకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక చిన్న ద్వీపం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖర్గ్ ఐలాండ్.
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖర్గ్ ఐలాండ్ భౌగోళికంగా చిన్నదే అయినప్పటికీ, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలక కేంద్రంగా భావించబడుతోంది. ఇరాన్ తీరానికి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ఆ దేశానికి ప్రధాన చమురు ఎగుమతి టర్మినల్‌గా పనిచేస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు ఈ ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న భారీ లోడింగ్ టెర్మినళ్ల ద్వారా రోజుకు సుమారు ఏడు మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురును ట్యాంకర్లకు ఎక్కించి ప్రపంచ మార్కెట్లకు పంపిస్తున్నారు.
1960 దశకంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, చమురు మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ ఇంధన రంగానికి ప్రధాన కేంద్రంగా మారింది. దేశంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాల నుంచి వచ్చే ముడి చమురు ఇక్కడికి చేరుకుని అంతర్జాతీయ మార్కెట్లకు పంపబడుతుంది. అందువల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ద్వీపం పాత్ర అత్యంత కీలకంగా మారింది.
ఇదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నప్పటికీ ఖర్గ్ ఐలాండ్‌ను మాత్రం ఇప్పటివరకు టార్గెట్ చేయలేదు. అయితే ఈ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఆలోచన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఖర్గ్ ఐలాండ్‌పై దాడి జరిగితే ఇరాన్ చమురు ఎగుమతులకు తీవ్ర దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ట్యాంకర్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ఎదురుదెబ్బ ఇస్తూ పోరాటం కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్గ్ ఐలాండ్‌పై దాడి జరిగితే ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ చర్య గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచి యుద్ధాన్ని మరో దశకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఖర్గ్ ఐలాండ్‌పై దాడి జరిగితే అది కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లకే భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.