అమెరికా కంటే హైదరాబాద్‌కే మొగ్గు చూపుతున్న ఎన్ఆర్ఐలు… కారణాలేంటి?
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ సొమ్ముకు అత్యధిక భద్రత, గరిష్ట రాబడిని ఆశిస్తున్నారు.;
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ సొమ్ముకు అత్యధిక భద్రత, గరిష్ట రాబడిని ఆశిస్తున్నారు. ఒకప్పుడు విదేశీయుల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అమెరికా వంటి దేశాల కంటే ఇప్పుడు మన హైదరాబాద్ నగరం ఎన్ఆర్ఐల తొలి ప్రాధాన్యతగా మారుతోంది. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ నగరం, ఇప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో "హాట్ స్పాట్"గా అవతరించింది. ఎన్ఆర్ఐలు అమెరికా వైపు చూడటం తగ్గించి హైదరాబాద్‌పై ఎందుకు మక్కువ చూపుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
పెట్టుబడిపై అధిక రాబడి
ఎన్ఆర్ఐలు హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం పెట్టుబడిపై వచ్చే రాబడి. గణాంకాలను పరిశీలిస్తే, అమెరికాలో సుమారు రూ. 8 కోట్ల పెట్టుబడికి వచ్చే అద్దె ఆదాయం నెలకు రూ. 3 లక్షలు మాత్రమే. అదే మొత్తాన్ని హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే నెలకు రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు అద్దె ఆదాయం పొందే అవకాశం ఉంది. రెంటల్ యీల్డ్ పరంగా చూస్తే హైదరాబాద్ రెట్టింపు లాభాలను అందిస్తుండటం ఎన్ఆర్ఐలను విశేషంగా ఆకర్షిస్తోంది.
తక్కువ ధరలు.. ఎక్కువ లాభాలు
అమెరికాలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీ ధరలు సామాన్య పెట్టుబడిదారులకు అందుబాటులో లేవు. అక్కడ ఆఫీస్ స్పేస్ చదరపు అడుగు ధర రూ. 40,000 నుండి రూ. 60,000 వరకు ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో అదే స్థాయి మౌలిక వసతులు, ప్రీమియం ఆఫీస్ స్పేస్ కేవలం రూ. 12,000 నుండి రూ. 20,000 మధ్య లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం కలిగిన వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు.. ఇది దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరగడానికి కూడా తోడ్పడుతుంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల జోరు
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ కంపెనీలకే పరిమితం కాలేదు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో విస్తరిస్తున్నాయి. దీనివల్ల వాణిజ్య కార్యాలయ స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం వల్ల ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు ఎప్పటికీ తిరుగుండదని ఎన్ఆర్ఐలు బలంగా నమ్ముతున్నారు.
మౌలిక వసతులు.. ప్రభుత్వ ప్రోత్సాహం
హైదరాబాద్‌లోని అత్యాధునిక మౌలిక వసతులు పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయి. మెట్రో రైలు వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ, విస్తృతమైన ఐటీ కారిడార్లు పెట్టుబడిదారులకు సౌకర్యంగా మారాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శకమైన .. పెట్టుబడి అనుకూల విధానాలు రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి.
భవిష్యత్తుకు భరోసా
రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ మరింత విస్తరించనుంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలు నగరంలో మళ్ళీ వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ పరిణామాలు వాణిజ్య స్థలాల విలువను మరింత పెంచే అవకాశం ఉంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికే సంతృప్త స్థాయి కి చేరుకున్న ధరలతో పోలిస్తే, హైదరాబాద్‌లోని మార్కెట్ ఇంకా వృద్ధి దశలోనే ఉంది. అందువల్ల, స్థిరమైన ఆదాయం మరియు ఆస్తి విలువ పెరుగుదల కోసం ఎన్ఆర్ఐలు హైదరాబాద్ వైపు చూడటం అత్యంత వివేకవంతమైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.