సౌత్ కొరియాలో జాబ్: మైండ్ బ్లాక్ అయ్యే నిజాలను బయటపెట్టిన భారతీయ యువతి!

గ్లోబల్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే విజయగాథలను చూసి నేటితరం యువ ప్రొఫెషనల్స్ విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

Update: 2026-06-07 01:30 GMT

గ్లోబల్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే విజయగాథలను చూసి నేటితరం యువ ప్రొఫెషనల్స్ విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు (కే-డ్రామాస్), అక్కడి సంస్కృతికి ఆకర్షితులై సౌత్ కొరియా వెళ్లాలని చాలామంది కలలు కంటారు. అయితే అసలు అక్కడ ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుంది? దైనందిన జీవితం ఎంత కష్టంగా ఉంటుందనే క్రూరమైన వాస్తవాలను వివరిస్తూ సౌత్ కొరియాలో నివసిస్తున్న ఒక భారతీయ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంట‌ర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. విదేశీ ఉద్యోగాలపై ఉన్న భ్రమలను పటాపంచలు చేస్తూ.. అక్కడి వ‌ర్క్ క‌ల్చ‌ర్‌పై ఈ వీడియో ఒక పెద్ద చర్చకు దారితీసింది.

ఈ వైరల్ వీడియో ప్రకారం.. సౌత్ కొరియా కార్పొరేట్ రంగంలో పని గంటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అగ్రిమెంట్‌లో రాసుకున్న సమయం ముగిసినా.. ఉద్యోగులు ఆఫీసులోనే గడపాల్సి రావడం.. అక్కడ పాటించాల్సిన కొన్ని అలిఖిత నిబంధనలు ఉద్యోగుల మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాయి. దీంతో ఎంత జీతం వచ్చినా మానసిక ప్రశాంతత, ఉద్యోగ సంతృప్తి మృగ్యమవుతోందని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సోషల్ మీడియాలో చూపించే రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోవద్దని.. వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉంటాయని హెచ్చరించింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అంతర్జాతీయ ఉద్యోగుల నుండి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదొక నగ్న సత్యం లాంటిదని పలువురు నెటిజన్లు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. సౌత్ కొరియా చదువుకోవడానికి మంచిదే కానీ ఉద్యోగాలకు మాత్రం పనికిరాదు. కాంట్రాక్ట్ పని గంటలు ముగిశాక కూడా ఎందుకు ఆఫీసులో కూర్చోవాలి? అని ఒక యూజర్ ప్రశ్నించగా.. మరొకరు తమ చేదు అనుభవాన్ని షేర్ చేస్తూ..``వీకెండ్స్‌లో కూడా ఎలాంటి అదనపు వేతనం లేకుండా పని చేయించుకుంటారని.. కొరియన్ సహోద్యోగుల ప్రతికూల ప్రవర్తన వల్ల అక్కడి వాతావరణం అత్యంత విషపూరితంగా మారుతుందని కామెంట్ చేశారు.

గ్లోబల్ కెరీర్ మార్కెట్‌లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ .. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. విదేశాల్లో ఉద్యోగం అనగానే కేవలం జీతాలు, విలాసవంతమైన జీవితాన్నే కాకుండా.. అక్కడి కంపెనీల పని తీరు.. స్థానిక ఉద్యోగుల ప్రవర్తన.. అక్క‌డి సంస్కృతిని కూడా ముందే అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది. లేదంటే భారీ ఆశలతో వెళ్లిన యువత తీవ్రమైన ఒత్తిడికి, అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News