అమెరికాలో తెలుగు హెచ్-1బీ ఉద్యోగి దావా.. టెక్ వర్గాల్లో చర్చకు దారి తీసిన కేసు
అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఓ తెలుగు టెకీ, తెలుగు మూలాలున్న ఓ ఐటీ స్టాఫింగ్ కంపెనీ యజమానిపై దాఖలు చేసిన కేసు ప్రస్తుతం భారతీయ ఐటీ వర్గాల్లో ముఖ్యంగా హెచ్-1బీ ఉద్యోగుల మధ్య విస్తృత చర్చకు దారితీసింది.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఓ తెలుగు టెకీ, తెలుగు మూలాలున్న ఓ ఐటీ స్టాఫింగ్ కంపెనీ యజమానిపై దాఖలు చేసిన కేసు ప్రస్తుతం భారతీయ ఐటీ వర్గాల్లో ముఖ్యంగా హెచ్-1బీ ఉద్యోగుల మధ్య విస్తృత చర్చకు దారితీసింది. వలస చట్టాలు, ఉద్యోగ భద్రత, ఐటీ కన్సల్టింగ్ కంపెనీల పనితీరుపై ఈ వ్యవహారం సరికొత్త చర్చను లేవనెత్తింది.
కోర్టులో దాఖలైన పిటిషన్ వివరాలు
అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఓ భారతీయ టెకీ, ఒక ఐటీ సంస్థతో పాటు ఆ సంస్థ తెలుగు సీఈవోపై దావా వేశారు. కోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం... ఉద్యోగాన్ని కొనసాగించడానికి అలాగే తన హెచ్1బీ వీసా హోదాను నిలుపుకోవడానికి తనపై భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలని సదరు సంస్థ ఒత్తిడి తీసుకువచ్చిందని భారతీయ టెకీ ఆరోపించారు. ఉద్యోగ నిబంధనలు, వేతన విధానం, వీసాపై ఆధారపడిన ఉద్యోగుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకుని యాజమాన్యం వేధింపులకు గురిచేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఇవన్నీ ప్రస్తుతం కోర్టులో చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ కేసుపై ఇప్పటివరకు కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ప్రతివాదుల వాదనలు, కోర్టు విచారణ, అందుబాటులోకి వచ్చే ఆధారాల ఆధారంగానే తుది నిర్ణయం వెలువడనుంది. అందువల్ల ఈ ఆరోపణలను తుది నిజాలుగా పరిగణించలేరని ఐటీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తెలుగు ఐటీ సమాజంలో భిన్న స్వరాలు
ఈ కేసు కేవలం న్యాయపరమైన అంశాన్ని దాటి అమెరికాలోని తెలుగు ఐటీ సమాజంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు తుది ఫలితం ఎలా ఉన్నప్పటికీ అమెరికా ఐటీ కన్సల్టింగ్ రంగంలో కొన్ని కీలక మార్పులకు ఇది కారణం కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఒప్పందాలు, వేతన చెల్లింపులు, ప్రాసెస్ ఫీజులు , డాక్యుమెంటేషన్ విషయాల్లో కంపెనీలు మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం పెరుగుతుంది. ఉద్యోగులతో యాజమాన్యాలు జరిపే ప్రతీ కమ్యూనికేషన్ చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం ఉండేలా కంపెనీలు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. హెచ్-1బీ ఉద్యోగుల్లో తమకు అమెరికా లేబర్ లాస్ కల్పిస్తున్న హక్కులపై మరింత అవగాహన పెరుగుతుంది.
అమెరికాలో హెచ్-1బీ ఉద్యోగుల ఉపాధి, వారి వీసా హోదా ఎంతగా పరస్పర అనుసంధానమై ఉంటాయో.. చిన్న పొరపాటు జరిగినా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయో ఈ కేసు మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం టెక్సాస్ ఫెడరల్ కోర్టులో విచారణలో ఉండగా కోర్టు ఇచ్చే తీర్పు కోసం అమెరికాలోని ఐటీ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.