ట్రంప్ చేసిన పాపం.. ప్రపంచాన్ని కదిలిస్తున్న చిన్నారుల ఫొటోలతో ఫస్ట్ పేజీ

యుద్ధం అంటే పత్రికల్లో కనిపించే రంగుల మ్యాపులు.. టీవీ చర్చల్లో వినిపించే గంభీరమైన వ్యూహాలు.. నాయకుల ఆవేశపూరిత ప్రసంగాలు మాత్రమే కాదు.;

Update: 2026-03-09 17:52 GMT

యుద్ధం అంటే పత్రికల్లో కనిపించే రంగుల మ్యాపులు.. టీవీ చర్చల్లో వినిపించే గంభీరమైన వ్యూహాలు.. నాయకుల ఆవేశపూరిత ప్రసంగాలు మాత్రమే కాదు. యుద్ధం అంటే... ఒక చిన్నారి నవ్వు శాశ్వతంగా ఆగిపోవడం.. ఒక తల్లి కన్నీరు ఇంకిపోవడం.. ఒక ఇల్లు శ్మశానంలా మారిపోవడం... ఇరాన్‌లోని మినాబ్‌లో జరిగిన పాఠశాల దాడి... ప్రపంచానికి యుద్ధం యొక్క అసలు క్రూరత్వాన్ని మరోసారి కళ్లకు కట్టింది. రాజకీయాల పేరుతో సాగుతున్న ఈ వినాశనంలో... చివరకు బలిపశువులుగా మారుతున్నది మాత్రం అమాయక పసిప్రాయాలే.

పాఠశాల అంటే జ్ఞానాన్ని పంచే దేవాలయం.. చిన్నారుల కలలకు పునాది వేసే చోటు. కానీ మినాబ్‌లో అదే పాఠశాల... మృత్యువు తాండవించిన వేదికగా మారింది. క్షిపణుల వర్షంలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వార్త మానవజాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. పాఠశాల గంట మోగాల్సిన చోట బాంబుల మోత వినిపించింది. పలకలు, పుస్తకాలు పట్టుకోవాల్సిన చిట్టి చేతులు, రక్తంతో తడిసిపోయాయి. ఇది కేవలం వార్తా కథనం కాదు, మానవత్వానికి పట్టిన మాయని మచ్చ.

ఈ విషాదంపై ప్రపంచ దేశాల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు మొదలయ్యాయి. అమెరికా క్షిపణుల దాడి అని ఇరాన్ వాదిస్తుంటే, ఇరాన్ సొంత క్షిపణులే ఆ పాఠశాలను తాకాయని డొనాల్డ్ ట్రంప్ తిప్పికొడుతున్నారు. యుద్ధ రంగంలో ఇలాంటి వాదోపవాదాలు సహజమే కావచ్చు. కానీ ఒక పక్క రాజకీయం చేస్తున్న నాయకులకు తెలియని నిజం ఏంటంటే... ఆ చిన్నారుల కళ్లల్లో వెలిగిన ఆశలు, వారు పండించాల్సిన భవిష్యత్తు ఇప్పుడు బూడిదయ్యాయి. ఎవరు బాధ్యులు అన్న ప్రశ్న కంటే.. ఈ మరణాలను ఆపలేకపోయామన్న అపరాధ భావం ప్రపంచాన్ని వెంటాడాలి.

ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే ప్రయత్నంలో భాగంగా ‘టెహ్రాన్ టైమ్స్’ పత్రిక ప్రచురించిన మొదటి పేజీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. చిన్నారుల ఫొటోలతో నిండిన ఆ పేజీపై ఉన్న ఒకే ఒక్క ప్రశ్న “ట్రంప్‌… ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు” అన్నది యావత్ ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఇది కేవలం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి దేశాధినేతకు.. ప్రతి యుద్ధోన్మాదికి పంపిన హెచ్చరిక.

యుద్ధం ఎవరికి లాభం చేకూరుస్తుందో కానీ.. నష్టపోయేది మాత్రం అభం శుభం తెలియని సామాన్యులే. రాజకీయాలు, సరిహద్దులు, సిద్ధాంతాలు... ఇవన్నీ కూడా ఒక చిన్నారి ప్రాణం కంటే విలువైనవి కావు. కానీ అధికారం కోసం ఆడే ఈ పాచికలాటలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత, అరాచకాలు, భౌగోళిక రాజకీయాల విశ్లేషణల మధ్య... ఆ చిన్నారుల అంతిమయాత్రను మనం మరచిపోకూడదు.

చివరికి మిగిలేది ఒకటే... యుద్ధంలో విజయం సాధించిన దేశం ఏదీ లేదు.. ఓడిపోయిన మానవత్వం తప్ప. మినాబ్‌లోని పాఠశాల గదుల్లో ఉన్న ఆ రక్తపు మరకలు, శిథిలాలు మనల్ని నిలదీస్తున్నాయి. మళ్లీ యుద్ధం అనే పదం విన్నప్పుడు.. ఆ పసివారికే కళ్ల ముందు మెదిలితే... బహుశా ప్రపంచంలో యుద్ధం అనే పదమే మరుగున పడుతుందేమో! యుద్ధాన్ని ఆపడానికి రాజకీయ చతురత అక్కర్లేదు... కాస్త మానవత్వం ఉంటే చాలు.

Tags:    

Similar News