నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. తప్పేంటి: దానం సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే.. దానం నాగేందర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన కుండబద్దలు కొట్టారు.;
ఖైరతాబాద్ ఎమ్మెల్యే.. దానం నాగేందర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఇలా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉన్నానన్నది తన వ్యక్తిగత అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు చేరువ కావడం.. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రజాప్రతినిధిగా ప్రస్తుతం తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను ఏపార్టీలో ఉన్నా.. ఎవరికీ నష్టం లేదన్నారు. పార్టీలు.. కంటే కూడా తనకు ప్రజలే ముఖ్యమని చెప్పారు. ప్రజల తరఫున పనిచేయడానికి కావాల్సినంత మద్దతు తనకు ఉందన్నారు.
2023లో బీఆర్ ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి విజయం దక్కించుకున్న దానం.. తర్వాత.. జరిగిన పరిణామాల క్రమంలో బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌కు మద్దతు దారుగా మారారు. గత నెలలో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేయాలని అనుకున్నారు. అయితే.. కొన్ని కారణాలతో కేవలం ప్రకటనలు.. తన సామాజిక వర్గానికి చెందిన వారితో అంతర్గత భేటీలు నిర్వహించారు. ఇక, బీఆర్ ఎస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పీకర్ ప్రసాదరావు.. జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. వారంతా బీఆర్ ఎస్‌లోనే ఉన్నారు.
అయితే.. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. సుప్రీంకోర్టు ఆదేశా ల నేపథ్యంలో స్పీకర్ చేపట్టిన విచారణకు కూడా వీరిద్దరు వివిధ కారణాలతో హాజరుకాలేదు. దీంతో వారిని కూడా విచారించా లని బీఆర్ ఎస్ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు స్పీకర్ చెప్పిన విషయంపైనా బీఆర్ ఎస్ మరోసారి న్యాయ పోరాటా నికిరెడీ అవుతోంది. ఇలాంటి కీలక సమయంలో దానం నాగేందర్ స్వయంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. తాను ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ విజయం సాధిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. రానున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-ఎంఐఎం కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు.
రాజీనామాకు రెడీ?
ఈ పరిణామాలను గమనిస్తే.. దానం నాగేందర్ అవసరమైతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా రెడీ అయి నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన రాజీనామాపై కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల కూడా సీఎం రేవంత్ రెడ్డి చెబితే.. తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అయితే.. పంచాయతీ పోరు నేపథ్యంలో ఆసమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య దూకుడు పెరగడం.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసుకున్న నేపథ్యంలో దానం చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏక్షణమైనా రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.