ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం సబబే

ఢిల్లీ హైకోర్టు ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓవైపు ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ;

Update: 2025-12-25 08:47 GMT

ఢిల్లీ హైకోర్టు ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓవైపు ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. దాని కారణంగా విరుచుకుపడుతున్న వ్యాధుల నుంచి తప్పించుకోవటానికి ఎయిర్ ఫ్యూరిఫైయర్లు కొనుగోలు చేద్దామంటే.. దాని ధరలు ఆకాశాన్ని అంటేలా ఉండటం.. అలాంటి అత్యవసర వస్తుసేవల మీదా 18 శాతం జీఎస్టీ విధించిన ఉదంతం తాజాగా కోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం తీరును ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లోనూ ఎయిర్ ఫ్యూరిఫైయర్ల మీద జీఎస్టీ అంత ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఏముందన్న భావనను వ్యక్తం చేసింది. జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. జీఎస్టీ కౌన్సెల్ తక్షణమే సమావేశమై ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై పన్ను తగ్గించటం లేదంటే రద్దు చేసే అంశానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలని పేర్కొంది.

ఎయిర్ ఫ్యూరిఫైయర్ ను వైద్య పరికరంగా గుర్తించి 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు బెంచ్ అసహనాన్ని వ్యక్తం చేసింది. మనిషి రోజుకు 21 వేలసార్లు శ్వాస తీసుకుంటారని.. అలాంటప్పుడు గాలి కాలుష్యంతో ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి లెక్కించాలని పేర్కొంది.

ఈ పిల్ విచారణ సందర్భంగా తాము స్పందించేందుకు తమకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారి.. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరమని.. అది అందించలేనప్పుడు కనీసం ఫ్యూరిఫైయర్లను అయినా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా? అంటూ ప్రశ్నించింది.

ఇప్పుడున్న వాయు అత్యవసర పరిస్థితుల్లో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు అమలు చేయకూడదు? అని ప్రశ్నిస్తూ.. ‘‘ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? ఈ అంశంపై ఈ రోజే స్పందన తెలియజేయాలి’ అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 26కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం ధర్మాగ్రహంగా చెప్పాలి. అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కోర్టు స్పందిస్తే తప్పించి.. ప్రభుత్వం తనకు తాను ఎందుకు ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోదు? అన్నది అసలు ప్రశ్న.

Tags:    

Similar News