పాకిస్తాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం.. భారత్ తో పెట్టుకుంటే అట్లుంటదీ
ఒక దేశపు భవిష్యత్తు ఆ దేశపు సరిహద్దుల వద్ద ఉండే ఆయుధాల మీద మాత్రమే కాదు... ఆ దేశ పౌరుల ఆరోగ్య స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది;
ఒక దేశపు భవిష్యత్తు ఆ దేశపు సరిహద్దుల వద్ద ఉండే ఆయుధాల మీద మాత్రమే కాదు... ఆ దేశ పౌరుల ఆరోగ్య స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌ను చూస్తుంటే ఈ మాట అక్షర సత్యమనిపిస్తుంది. రాజకీయ విద్వేషాలు, సైనిక ప్రాధాన్యతలు ఒక దేశ ప్రజల ప్రాణాలను ఎలా ఫణంగా పెడతాయో చెప్పడానికి పాకిస్తాన్‌లో ముంచుకొస్తున్న వ్యాక్సిన్ సంక్షోభమే నిదర్శనం.
భారత్ దూరం.. భారమైన భారం
ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 60 శాతానికి పైగా తీరుస్తూ 'గ్లోబల్ వ్యాక్సిన్ పవర్‌హౌస్'గా భారత్ ఎదిగింది. సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ వంటి సంస్థలు అందించే చౌకైన వ్యాక్సిన్లే పాకిస్తాన్ వంటి పేద దేశాలకు శ్రీరామరక్ష. అయితే 2025లో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' తదితర పరిణామాల వల్ల భారత్ నుండి వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోవడం పాక్ ఆరోగ్య వ్యవస్థపై పిడుగులా పడింది. ఇప్పటి వరకు ఏడాదికి $40 మిలియన్లుగా ఉన్న ఇంపోర్ట్ బిల్లు, భారత్ నుండి సప్లై లేకపోవడం వల్ల రాబోయే కాలంలో $1.2 బిలియన్లకు (సుమారు ₹10,000 కోట్లు) చేరుతుందని అంచనా.
వైఫల్యాల సుడిగుండంలో పాకిస్తాన్
పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, వ్యవస్థాగత వైఫల్యం కూడా.. దశాబ్దాలుగా రక్షణ రంగంపై పెట్టిన శ్రద్ధలో పదో వంతు కూడా ఆరోగ్య రంగంపై పెట్టకపోవడంతో కనీసం ఒక చిన్న వ్యాక్సిన్‌ను కూడా సొంతంగా తయారు చేసుకునే స్థితిలో ఆ దేశం లేదు. మీజిల్స్ కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం.. ఏడాదికి 90 వేల మందికి పైగా చిన్నారులు న్యూమోనియాతో చనిపోతుండటం ఆ దేశ పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రపంచమంతా పోలియో రహితంగా మారుతుంటే పాకిస్తాన్ ఇంకా ఆ మహమ్మారి కోరల్లోనే ఉంది. వ్యాక్సిన్లపై ఉన్న మూఢనమ్మకాలు, హెల్త్ వర్కర్లపై దాడులు ఆ దేశాన్ని వెనక్కి నెడుతున్నాయి.
జీఏవీఐ మద్దతు.. ఒక తాత్కాలిక ఊరట
ప్రస్తుతం జీఏవీఐ సంస్థ అందిస్తున్న సాయం వల్ల పాకిస్తాన్ నెట్టుకొస్తోంది. కానీ 2030 నాటికి ఈ సపోర్ట్ నిలిచిపోనుంది. అప్పుడు మొత్తం భారాన్ని పాక్ ప్రభుత్వం స్వయంగా భరించాల్సి ఉంటుంది. 47 మిలియన్ల మంది పేదరికంలో ఉన్న దేశంలో ఖజానా ఖాళీగా ఉన్న స్థితిలో ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం అసాధ్యమనే చెప్పాలి.
పాకిస్తాన్ హెల్త్ మినిస్టర్ ముస్తఫా కమల్ నిద్రలేని రాత్రులు గడపడానికి కారణం కేవలం వ్యాక్సిన్ల కొరత మాత్రమే కాదు.. ఆ దేశ పాలకుల ప్రాధాన్యతలు. ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని మిలిటరీ వ్యవస్థ.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పటికైనా భారత్ వ్యతిరేక రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించకపోతే... పాకిస్తాన్ భవిష్యత్తు అంధకారమవ్వడం ఖాయం. ఒక దేశపు ఆరోగ్య వ్యవస్థ కూలిపోతే అది ఆ దేశానికే కాదు, పొరుగు దేశాలకు.. ప్రపంచ ఆరోగ్య భద్రతకే ముప్పు.