కన్నవారు వద్దన్నారు.. పోస్టుమార్టంకు వైద్యులు కాదన్నారు.. చివరికి నరహంతకుడికి అనాథశవంలా అంత్యక్రియలు

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన షాబాద్‌ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ముగింపు అత్యంత హృదయ విదారకంగా ముగిసింది.

Update: 2026-07-14 05:35 GMT

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన షాబాద్‌ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ముగింపు అత్యంత హృదయ విదారకంగా ముగిసింది. జీవించి ఉన్నప్పుడు ఆరుగురి ప్రాణాలు తీసి క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ నరహంతకుడికి.. మరణానంతరం కనీసం కన్నవారి చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు కూడా నోచుకోలేదు. బతికినంత కాలం రాక్షసత్వంతో ఊగిపోయిన రాజ్‌కుమార్.. చివరకు ఒక అనాథ శవంగా మట్టిలో కలిసిపోయాడు.

మృతదేహాన్ని ఛీత్కరించుకున్న కన్నవారు

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రాజ్‌కుమార్ శవపరీక్ష ముగిసిన తర్వాత.. పోలీసులు ఆ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కన్న హృదయాలు, రక్తసంబంధీకులు అతడు చేసిన పాపాలను భరించలేకపోయారు. మృతదేహాన్ని స్వీకరించేందుకు అతని తల్లిదండ్రులు, సోదరుడు తీవ్రంగా నిరాకరించారు. అంబులెన్స్‌లో ఉన్న రాజ్‌కుమార్ శవాన్ని చూసి కూడా వారు కన్నీరు కార్చకుండానే వెనుదిరిగి వెళ్లిపోయిన తీరు అక్కడున్న వారిని సైతం కలచివేసింది. రక్తసంబంధమే ఛీత్కరించుకున్న వేళ.. ఆ శవం దిక్కులేనిదై నిలబడింది.

పోస్టుమార్టం వద్దంటూ వైద్యుల వెనకడుగు

అంతకుముందు రాజ్‌కుమార్ మృతదేహం పోస్టుమార్టం ప్రక్రియలోనూ అనూహ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఆరుగురిని బలిగొన్న నిందితుడి మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా డ్యూటీలో ఉన్న వైద్యురాలు నిరాకరించారు. దీంతో దాదాపు మూడు గంటల పాటు ప్రక్రియ స్తంభించిపోయింది. చివరికి పోలీసులు వికారాబాద్ జిల్లా ఆసుపత్రి వైద్యుల కోసం ప్రయత్నించి.. చివరకు చేవెళ్ల ఆసుపత్రికి చెందిన డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్‌లను ప్రత్యేకంగా పిలిపించి రాత్రి పూట శవపరీక్ష పూర్తి చేయించారు.

బంధువులు లేరు.. బాంధవ్యాలు లేవు..

కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అస్సలు తీసుకోబోమని తేల్చి చెప్పడంతో పోలీసులే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సి వచ్చింది. చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో స్థానిక శ్మశానవాటికలో రాజ్‌కుమార్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం కడసారి చూపు చూసేందుకు బంధువు గానీ.. గుక్కెడు నీళ్లు పోసేందుకు స్నేహితుడు గానీ లేడు. కేవలం ప్రభుత్వ అధికార యంత్రాంగం సమక్షంలో ఒక అనాథ శవంలా రాజ్‌కుమార్‌ అంతిమ సంస్కారాలు ముగిశాయి.

ఒకప్పుడు నిండు కుటుంబంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కేవలం తన క్రూరమైన ఆలోచనలు, నిర్ణయాల వల్ల సమాజానికే కాకుండా సొంత కుటుంబానికి కూడా శాశ్వతంగా దూరమయ్యాడు. రాజ్‌కుమార్ చేసిన అమానుష హత్యలు ఎన్నో కుటుంబాలలో తీరని చీకట్లను నింపగా.. చివరకు అతడి ముగింపు కూడా అంతే చీకటిగా ఒంటరిగా ముగిసింది. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులే మన అంతిమ ప్రయాణాన్ని నిర్ణయిస్తాయని చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం.

Tags:    

Similar News