‘జెన్ జెడ్’కి ఇక ఐటీ ఫీల్డ్ కష్టమేనా? ‘జెన్ ఆల్ఫా’కి సాఫ్ట్‌వేర్ అంటేనే తెలియని రోజులు వస్తాయా?

ఒకప్పుడు మన దేశంలో పెళ్ళి సంబంధాల మార్కెట్ నుండి బ్యాంక్ లోన్ల వరకు దేనికైనా ఒకటే మంత్రం... "అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం" చేయాలన్నది ప్రధాన ధ్యేయంగా ఉండేది.

Update: 2026-07-14 05:56 GMT

ఒకప్పుడు మన దేశంలో పెళ్ళి సంబంధాల మార్కెట్ నుండి బ్యాంక్ లోన్ల వరకు దేనికైనా ఒకటే మంత్రం... "అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం" చేయాలన్నది ప్రధాన ధ్యేయంగా ఉండేది. ఇంజినీరింగ్ నాలుగు గోడల మధ్య నాలుగు ఏళ్ళు గడిపేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ‘టిసిఎస్’ లేదా ‘ఇన్ఫోసిస్’ ఆఫర్ లెటర్ చేతిలో పడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని ఫీలయ్యేవాళ్ళం. కానీ పాపం... మన జెన్ జెడ్ తరం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది..

ఇప్పుడు ఐటీ ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉందంటే అమెరికాలో హెచ్1-బీ వీసాల ముచ్చట దేవుడెరుగు... ఇక్కడ స్వదేశంలో కూడా లేఆఫ్స్ దెబ్బకి కుర్చీలు కదులుతున్నాయి. ఒకప్పుడు కంపెనీలు మారడం అంటే వారాల ముచ్చట.. ఇప్పుడేమో నెక్స్ట్ ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక నెలల తరబడి చాకిరీ వెతుక్కోవాల్సి వస్తోంది. సీనియర్ల పరిస్థితే "ఏ క్షణాన పింక్ స్లిప్ వస్తుందో" అని గుండెలు చేతుల్లో పట్టుకుని బతుకుతుంటే ఇక ఇప్పుడే కాలేజీల నుండి బయటకు వస్తున్న ఫ్రెషర్ల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా మారింది.

సింగిల్ స్కిల్ రోజులు పోయాయి.. జెన్ జెడ్ కి మార్పు తప్పదా?

అప్పట్లో లాగా "నాకు జావా వచ్చు నా బతుకు బండి సాగిపోతుంది" అంటే కుదరదు. ఇప్పుడు జెన్ జెడ్ కేవలం కోడింగ్ నమ్ముకుంటే కుక్కలు చించిన విస్తరే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త టెక్నాలజీలను ఒంటబట్టించుకోవాలి. లేదంటే రూట్ మార్చి... యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, గేమ్ డెవలప్‌మెంట్ లాంటి సృజనాత్మక రంగాల వైపు అడుగులు వేయాలి. అంటే భవిష్యత్తులో "సాఫ్ట్‌వేర్ ఇంజినీర్" అనే ట్యాగ్ కంటే "మల్టీ టాస్కర్" లేదా "ప్రాబ్లమ్ సాల్వర్" అనే ముద్ర ఉంటేనే మార్కెట్‌లో మనుగడ సాధ్యం.

జెన్ ఆల్ఫా కు "సాఫ్ట్‌వేర్ అంటే తినే పదార్థమా నాన్నా?"

ఇక అసలు ట్విస్ట్ జెన్ ఆల్ఫా (2010 తర్వాత పుట్టిన తరం) తోనే రాబోతోంది. వీళ్ళు పూర్తిగా ఏఐ సామ్రాజ్యంలో పెరిగి పెద్దవుతున్నారు. వీళ్ళు ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేసరికి అసలు సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అనేవి మ్యూజియంలో కూడా దొరకకపోవచ్చు. "ఒకప్పుడు మీ తాతలు, నాన్నలు కంప్యూటర్ ముందు కూర్చుని రాత్రింబవళ్లు 'కోడింగ్' అనే ఒక వింత ప్రక్రియ చేసేవారురా..." అని జెన్ ఆల్ఫా పిల్లలకి కథలు కథలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎందుకంటే అప్పటికి కోడింగ్ అంతా ఏఐ చూసుకుంటుంది. ఈ తరానికి 'సాఫ్ట్‌వేర్ ఉద్యోగం' అనే కాన్సెప్ట్ కూడా తెలియకపోవచ్చు. వాళ్లకు తెలిసిందల్లా ఏఐ టూల్స్‌ని ఎలా వాడాలి. కొత్తగా ఏం ఆవిష్కరించాలి.. డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా చేయాలి అనేదే..

డిగ్రీల కాలం చెల్లింది, నైపుణ్యమే ముఖ్యం

"నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. నాకు కుర్చీ వేసి ఉద్యోగం ఇవ్వండి" అనే రోజులు ఇక రావు. సృజనాత్మక రంగాల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. అక్కడ పోటీ మామూలుగా ఉండదు. కానీ రాబోయే కాలం కేవలం సర్టిఫికెట్లది కాదు.. టాలెంట్‌ది.. భవిష్యత్తులో నిలబడాలంటే ఒకే బోటుపై కాలు పెట్టకుండా.. విభిన్న నైపుణ్యాల వైపు మొగ్గు చూపడం ఈ తరం యువతకు అత్యంత అవసరం. లేదంటే ఐటీ కలలు కరిగిపోవడం ఖాయం..

Tags:    

Similar News