'సూపర్ సుబ్బు' సినిమా ఎఫెక్ట్ మొదలైందిగా..? స్కూళ్లు, కాలేజీల్లో 'సె*క్స్ ఎడ్యుకేషన్'..
అలాంటి వాటిలో టాప్ 1 ప్లేస్ దేనికైనా ఉందీ అంటే అది నిస్సందేహంగా 'సె*క్స్ ఎడ్యుకేషన్'.
మన దేశంలో కొన్ని విషయాల గురించి మాట్లాడాలంటే మైకులు కట్ అవుతాయి.. గొంతులు నొక్కుకుపోతాయి. అలాంటి వాటిలో టాప్ 1 ప్లేస్ దేనికైనా ఉందీ అంటే అది నిస్సందేహంగా 'సె*క్స్ ఎడ్యుకేషన్'. అయితే థియేటర్లలో రీసెంట్‌గా సందడి చేసిన 'సూపర్ సుబ్బు' సినిమా పుణ్యమా అని.. ఇప్పుడు ఈ హాట్ టాపిక్ కాస్తా మరింత హీటెక్కింది. థియేటర్లో సుబ్బు గారు క్లాసులు పీకడమే ఆలస్యం.. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రూటు మార్చేసి, దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో ‘కాంప్రహెన్సివ్ సె*క్స్ ఎడ్యుకేషన్’ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
దీంతో సోషల్ మీడియా బ్యాచ్ ఊరుకుంటుందా? "అంతా మన సూపర్ సుబ్బు ఎఫెక్టే రా భాయ్! సినిమా చూసే మనోళ్లు రూల్స్ మార్చేస్తున్నారు" అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి సినిమానే కారణం అని బోర్డులు తిప్పి చెప్పడానికి ఎలాంటి అధికారిక ఆధారాలూ లేవు గానీ.. సినిమా రిలీజ్ అయిన వేళ ఈ ఆదేశాలు రావడంతో టైమింగ్ మాత్రం అదిరిపోయింది కదూ..
ఆ కోర్టు పర్మిషన్ ఇస్తే.. ఇక సిలబస్ మారినట్లే
అవును మీరు విన్నది నిజమే. స్కూళ్లు, కాలేజీల్లో ఈ ‘సె*క్స్ ఎడ్యుకేషన్’ను అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకే తెలిపింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. క్లాసు రూముల్లో కొత్త పాఠాలు మొదలైపోతాయి.
పిల్లల భద్రత, శారీరక-మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపుల నివారణ వంటి ముక్కోణపు అంశాలపై చిన్న వయసులోనే అవగాహన కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. మొన్నటివరకు "ఛీ ఛీ.. ఇవేం పాడు మాటలు" అని ముక్కున వేలేసుకున్న సమాజానికి, ఇప్పుడు క్లాస్ రూమ్ బోర్డుల మీద ఈ పాఠాలు తప్పనిసరి కాబోతున్నాయి.
నిపుణుల కమిటీ సిఫార్సులు ఇలా ఉన్నాయి..
స్కూల్ సిలబస్‌లో 'సె*క్స్ ఎడ్యుకేషన్', 'చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అవగాహన' తప్పనిసరి చేయాలి. వారానికి కనీసం రెండు సార్లు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలి. సొంత శరీర భాగాల గురించిన అవగాహనతో పాటు ముఖ్యంగా 'సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్' తేడాలు నేర్పించాలి. ఏదైనా ఆపద వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రాక్టికల్‌గా వివరించాలి.
అంటే.. కేవలం ‘అదే’ కాదు బాబోయ్
ఇక మన సమాజంలో 'సె*క్స్ ఎడ్యుకేషన్' అనగానే చాలామంది మనోభావాలు దెబ్బతినిపోతాయి. "అమ్మో.. చిన్న పిల్లలకు ఇవన్నీ చెప్తే చెడిపోతారు" అంటూ కొందరు గుండెలు బాదుకోవడం సహజం. కానీ కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించే నిపుణులు మాత్రం మరొకటి చెబుతున్నారు. సె*క్స్ ఎడ్యుకేషన్ అంటే కేవలం లైంగిక అంశాల గురించిన ముచ్చట్లు మాత్రమే కాదు. యుక్తవయస్సులో శరీరంలో వచ్చే సహజ మార్పులను అర్థం చేసుకోవడం. వ్యక్తిగత భద్రత & సమ్మతి తెలియజెప్పి ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని గౌరవించడం, 'నో' అంటే 'నో' అని తెలుసుకోవడం. ఆన్‌లైన్ ప్రపంచంలో పొంచి ఉన్న డేంజర్ల నుంచి తప్పుకోవడం... లైంగిక వేధింపుల గుర్తింపులో భాగంగా ఏది అల్లరి, ఏది నేరం అని గుర్తించి రక్షణ పొందడం దీని ఉద్దేశం. ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఎప్పటి నుంచో సిలబస్‌లో భాగమే. మన దగ్గర ఆలస్యంగానైనా ఈ అడుగు పడుతుండటం శుభపరిణామమే.
సినిమాలు సమాజాన్ని మారుస్తాయో లేదో తెలీదు గానీ.. చర్చను మాత్రం గట్టిగా లేవనెత్తుతాయి. 'సూపర్ సుబ్బు' సినిమా థియేటర్లలో రేపిన సెన్సేషన్ ఇప్పుడు క్లాస్ రూమ్‌ల వైపు అడుగులు వేయిస్తోంది. సమాజంలో కొందరు ఇంకా ముక్కున వేలేసుకుంటున్నా పిల్లల భద్రత కోసం ఈ మార్పు ఎంతో అవసరం. మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి ముద్ర వేస్తుందో, స్కూల్ పుస్తకాల్లో ఈ 'కొత్త' పాఠాలు ఎప్పుడు ముద్రితమవుతాయో చూడాలి.