‘మాయల ఫకీరు కన్నా చంద్రబాబు నిష్ణాతుడు’ - భూమన వ్యంగ్యస్త్రాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిలో మినీ అమెజాన్ అడవి ఏర్పాటు చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై భూమన విమర్శలు ఎక్కుపెట్టారు. తనదైన స్టైల్ లో సీఎం చంద్రబాబుపై వ్యంగ్యస్త్రాలు విసురుతూ మీడియాకు వీడియో విడుదల చేశారు. సుమారు 10 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో దాదాపు ఏడు నిమిషాల పాటు సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలే ఉన్నాయి. చంద్రబాబు అనుకుంటే ఆకాశాన్ని అమరావతిలో ఇరికించేస్తారని, ఏపీ అంతటా ఏసీ చేసేస్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతిలో శాఖమూరు వద్ద 300 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పార్కులో మినీ అమెజాన్ అడవులను తలపించేలా రెయిన్ ఫారెస్టు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పత్రికల్లో వచ్చిన వార్తలపై వైసీపీ నేత భూమన వ్యంగ్యంగా స్పందించారు. 5 ఎకరాల్లో అడవిని సృష్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 7 ఎకరాల్లో ఫసిపిక్ మహాసముద్రాన్ని కూడా తీసుకురావాలని అందులో తిమింగళాలు, డాల్ఫిన్లను వదలాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మూడు నాలుగు ఎకరాల్లో ఎవరెస్టు వంటి హిమాలయ శిఖరాన్ని తీసుకురావాలి చంద్రన్న అంటూ భూమన విమర్శలు ఎక్కుపెట్టారు.
అమరావతిలో అన్నీ దొరకాలంటే చంద్రబాబు మాత్రమే చేయగలరని, ఇంద్రుని అమరావతి కంటే ఈ అమరావతిని అత్యద్భుతంగా చంద్రబాబు మాయాజాలంతో సృష్టించగలరన్నారు. చంద్రబాబు వద్ద కుబేరుడు ఉన్నాడు, మీ వద్ద అపరబ్రహ్మలు ఉన్నారు కనుక మీరైతే ఇలాంటివన్నీ చేయగలరని భూమన వ్యాఖ్యానించారు. ఇంద్రుడి అమరావతిలోనే అన్ని సౌకర్యాలు ఉండాలా? మన అమరావతికి వద్దా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అనుకుంటే అప్సరసలు కూడా అమరావతికి వస్తారన్నారు. ఇంద్రుడి అమరావతిని భ్రమింపజేసేలా అమరావతికి అడవులు, సముద్రాలు, పర్వతాలు తీసుకువస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అయితేనే ఇలాంటివి చేగలరని, మీరు అనుకుంటే ఆకాశాన్ని అంగుళం స్థలంలో ఇరికించేయగలరని వరుస సెటైర్లువేశారు. గొప్పలు చేయాలంటే మాయల ఫీకరు కన్నా చంద్రబాబు నిష్ణాతుడు అంటూ మండిపడ్డారు. మీ కాళ్లకు కాదు కదా, మీ చెప్పులకు కూడా భజన చేసే పత్రికలు ఉన్నాయని అన్నారు. అదిగో నవలోకం.. జనానికేమో అంతా మైకం అంటూ భూమన ఆక్షేపించారు. చంద్రబాబు మనిషి కాదని సాక్ష్యత్తూ విష్ణమూర్తి అవతారం అంటూ దెప్పిపొడిచారు. మేలు చేస్తారని మేము ఎన్నుకుంటే మేళం పెట్టిస్తానని చంద్రబాబు అంటున్నారని భూమన ఆక్షేపించారు.