రెండు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉండాలి : కవిత ఆసక్తికర వ్యాఖ్యలు - నెట్టింట భిన్నమైన చర్చ!

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ సినిమా ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన కవిత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసివుండాలని ఆకాంక్షించారు.

Update: 2026-07-14 07:13 GMT

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ సినిమా ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన కవిత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసివుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ మధ్య భాషా పరమైన వైవిధ్యాన్ని ప్రస్తావించారు. సినిమా టైటిల్ లో వెంకటరామయ్య గారి తాలుకా అని ఉందని తాలుకా అంటే తమ ప్రాంతీయులకు అర్థం కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలోనే రాష్ట్రాలుగా కొట్లాడుకున్నా, తెలుగు ప్రజలుగా అందరం కలిసి ఉండాలని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కవిత ఆకాంక్షలను స్వాగతించినా రాష్ట్రాలుగా కూడా ఎందుకు కొట్లాడుకోవడం అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పక్కా తెలంగాణ వాదిగా తనను తాను నిరూపించుకునేందుకు కవిత ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సొంతపార్టీ పెట్టుకున్న కవిత తెలంగాణ వాదాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రాంతీయ సెంటిమెంటును రగిల్చేలా ఎక్కువగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నాయకులు, రాజధాని అమరావతిపై ఆమె గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నవర్షం పడినా అమరావతి మునిగిపోతుందని కవిత విమర్శలు చేస్తే అక్కడికి రెండు రోజుల్లోనే హైదరాబాద్ ను ఓ వర్షం ముంచెత్తింది. ఈ సమయంలో కవితను ఎక్కువమంది నెటిజన్లు ట్రోల్ చేశారు.

ఈ పరిస్థితుల్లో కవిత తన వైఖరి మారిందనేలా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, సంస్కృతిని కలిపేలా సినిమా పరిశ్రమ ఉండాలని కవిత వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సందర్భంగా ఆమె తన పాత పంథాలో రాష్ట్రాలుగా కొట్లాడుకుందామనేట్లు మాట్లాడటమే విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. రెండు పక్కపక్క రాష్ట్రాలు కలిసిమెలిసి పనిచేయడం ద్వారా అభివృద్ధి చెందే అవకాశం లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటై సుమారు 12 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆంధ్రులపై ద్వేషం రగిల్చేలా కొందరు మాట్లాడుతుండడాన్ని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, వాతావరణం ఎక్కువ కాకుండా నిరోధించేలా ఉభయ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు వ్యవహరించాల్సివుంటుందని సూచిస్తున్నారు. కానీ, కొందరు నేతలు తమ అస్థిత్వం కోసం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తుంటారని పరోక్షంగా కవితపై నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వారు కలిసి ఉండాలనే ఆకాంక్ష వ్యక్తం చేయడం ద్వారా కవిత నెటిజన్లను ఆకర్షించారని అంటున్నారు.

Tags:    

Similar News