షుగర్ రోగులకు చైనా శుభవార్త.. సరికొత్త థెరపీకి ఆవిష్కరణ!

ఒక్కోసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లతో కుస్తీ పట్టాల్సిందే అని భయపడే వారికి చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన తీపి కబురు చెప్పారు.;

Update: 2026-02-20 06:27 GMT

ఒక్కోసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లతో కుస్తీ పట్టాల్సిందే అని భయపడే వారికి చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన తీపి కబురు చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా 'స్టెమ్ సెల్ థెరపీ' ద్వారా టైప్-2 డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేసి చరిత్ర సృష్టించారు. ఇన్సులిన్ తో పనిలేకుండా, శరీరం తనంతట తానుగా చక్కెర స్థాయిలను నియంత్రించుకునేలా చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు వైద్య రంగంలో పెను సంచలనంగా మారింది.

స్టెమ్ సెల్ మ్యాజిక్.. ఇన్సులిన్‌కు గుడ్ బై:

చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం డయాబెటిస్ బాధితుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సాధారణంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రోజూ మాత్రలు వేసుకోవడం లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం చేస్తుంటారు. కానీ, ఈ కొత్త థెరపీ ద్వారా ప్యాంక్రియాటిక్ కణాలను పునరుద్ధరించి, శరీరం సహజంగానే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా చేశారు. ఇక ఈ చికిత్స పొందిన రోగి ఇప్పుడు ఎలాంటి బాహ్య ఇన్సులిన్ సహాయం లేకుండానే ఆరోగ్యంగా ఉండటం విశేషం. ఇది గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, డయాబెటిస్ అనేది ఇక భయపడాల్సిన జబ్బు కాదు, నయం చేయగల సమస్యగా మారిపోతుంది.

అసలు ఈ థెరపీ ఎలా పనిచేస్తుంది?

ఈ వినూత్న చికిత్సలో మన శరీరంలోని 'స్టెమ్ సెల్స్' కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా రోగి లేదా దాత నుండి ఈ కణాలను సేకరిస్తారు. వీటిని ల్యాబ్‌లో ప్రత్యేకమైన రసాయనాలు మరియు జెనెటిక్ పద్ధతులను ఉపయోగించి 'ప్యాంక్రియాటిక్ కణాలు'గా మారుస్తారు. మన శరీరంలో ఇన్సులిన్‌ను తయారు చేసేది ఈ ప్యాంక్రియాటిక్ కణాలే. ఇక ల్యాబ్‌లో తయారైన ఈ కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పొందాక, వాటిని రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఒకసారి శరీరం ఈ కొత్త కణాలను స్వీకరిస్తే, అవి సహజంగానే చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ అవసరమైన మేర ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి.

ప్రపంచానికి విముక్తి.. శాస్త్రవేత్తల గురి:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జీవనశైలి మార్పుల వల్ల యువత కూడా ఈ బారిన పడుతున్నారు. ఇలాంటి తరుణంలో చైనా సాధించిన ఈ విజయం ఒక మైలురాయి వంటిది. ఇక ఈ స్టెమ్ సెల్ మార్పిడి విజయవంతం కావడం వల్ల భవిష్యత్తులో వేల రూపాయల మందుల ఖర్చు, ఇంజెక్షన్ల నొప్పి నుంచి రోగులకు విముక్తి లభిస్తుంది. అయితే, ఈ చికిత్స సక్సెస్ రేటు అనేది రోగి శరీరం ఆ కణాలను ఎంతవరకు స్వీకరిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటునారు నిపుణులు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ విధానం త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న ఇటువంటి పరిశోధనలు మానవాళికి వరం లాంటివి. డయాబెటిస్ రహిత ప్రపంచం దిశగా చైనా వేసిన ఈ అడుగు నిజంగా అభినందనీయం. ఇంజెక్షన్లు అవసరం లేని రోజులు త్వరలోనే రాబోతున్నాయని ఆశిద్దాం.

Tags:    

Similar News