ఎబోలా...ఏపీ ఫుల్ అలెర్ట్
ఎబోలా. ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా మాదిరిగా ఇది కూడా లోకాన్ని మృత్యు ఊయలలో పెట్టి ఊపేస్తుందా అన్న చర్చ సాగుతోంది.
ఎబోలా. ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా మాదిరిగా ఇది కూడా లోకాన్ని మృత్యు ఊయలలో పెట్టి ఊపేస్తుందా అన్న చర్చ సాగుతోంది. అలాగని భయపడకుండా తేలికగా తీసుకుంటే ఆనక కొంపలు అంటుంటాయా అన్నది కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఎబోలాను సీరియస్ గా తీసుకోవాల్సిందే అని అన్ని దేశాలకు స్పష్టం చేసింది. దాంతో భారత్ అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఏపీ కూడా ఫుల్ అలెర్ట్ అయింది.
ఎయిర్ పోర్టులల్లోనే స్కానింగ్ :
కరోనా టైం లో ఎలా చేశారో ఇపుడు కూడా ఏపీలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు అన్నింటిలోనూ స్కానింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే క్వారంటైన్ :
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ, సదరు జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు.
ఒక్క కేసూ నమోదు కాలేదు :
ఇదిలా ఉంటే భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఉగాండా దక్షిణ సూడాన్‌లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని కేంద్రం దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడికి ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని కేంద్రం పేర్కొంది.
ఆఫ్రికన్ యూనియన్ కి భారత్ సాయం :
మరో వైపు భారత్ ఆఫ్రికన్ యూనియన్ కి సాయం చేస్తోంది. వైద్య పరమైన సహకారాన్ని అందించడం ద్వారా ఎబోలాను అక్కడే నియంత్రించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామాగ్రి మొదటి విడతను భారతదేశం ఈ రోజు పంపించింది. ఆఫ్రికన్ యూనియన్ లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్ కి సహాయంగా ఈ వైద్య సామాగ్రిని పంపించినట్లుగా కేంద్రం వెల్లడించింది. ఆఫ్రికన్ యూనియన్‌తో సమన్వయంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు, ఆఫ్రికాకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఎబోలా మాత్రం ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది అన్నది కచ్చితంగా చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.