మగవాళ్ళు తాగుడు...ఆడవాళ్లు పొగ తాగుడు
పొగ తాగని వాడు దున్నపోతై పుడతాడు అని కన్యాశుల్కంలో మహాకవి గురజాడ అప్పారావు చెప్పాడు.
పొగ తాగని వాడు దున్నపోతై పుడతాడు అని కన్యాశుల్కంలో మహాకవి గురజాడ అప్పారావు చెప్పాడు. మరి ఆ మాటను మగవారు ఎంత పాటించారో కానీ ఆడోళ్ళు మాత్రం వారిని మించిపోతున్నారుట. ఇది నోటి మాటగా అన్నది కాదు, ఒక సర్వే చెప్పిన కఠిన వాస్తవం. తాజాగా వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అందులో ఆడవారు పొగతాగడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు అన్న సమాచారం అయితే షాకింగ్ గానే ఉంది అని అంటున్నారు.
పొగాకు వినియోగంలో :
ఈ నివేదిక ప్రకారం చూస్తే కనుక దేశవ్యాప్తంగా మహిళలలో పొగాకు వినియోగం 8.9 శాతం నుంచి 8.4 శాతానికి స్వల్పంగా తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో చూస్తే కనుక బాగా పెరిగింది అన్న సంగతి ఆందోళన పెంచుతోంది. అలా పెరిగిన రాష్ట్రాలలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 13 రాష్ట్రాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాలలోని మహిళలు పొగాకును ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా జాతీయ సర్వే నివేదిక చెప్పుకొచ్చింది. మహిళలతో పోలిస్తే మగవారిలో పొగాకు వినియోగం 38 శాతం నుంచి 36.3 శాతానికి తగ్గింది. మరి ఆడవారే పొగాకు వాడకంతో బానిసలుగా ఎందుకు మారిపోతున్నారు అంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం ఒక ప్రధాన కారణంగా ఉంది. అలాగే సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి వాటి వల్లనే పొగాకు, మద్యం వాడకంలో మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లుగా ఈ జాతీయ నివేదిక విశ్లేషించింది.
తాగి తూగుతున్నారు :
ఇక మగవారు ఏమీ తక్కువ తినలేదు. మద్యపానంతో వారు తాగి తూగుతున్నారని ఈ నివేదిక చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చూస్తే పురుషుల మద్యపానం పెరుగుదల బాగానే ఉంది. అందులోనూ ఏపీ తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం అని సర్వే స్పష్టం చేస్తోంది. అంతే కాదు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా పురుషులలో మద్యం వినియోగం పెరగడం గమనార్హంగా ఉంది. ఇక
జాతీయ స్థాయిలో చూస్తే ప్రతీ పదిహేనేళ్ళ పైబడిన పురుషులలో అత్యధిక శాతంలో మద్యపాన అలవాటు ఉందని తేలింది. దాంతో జాతీయ స్థాయిలో ఇది 18.7 శాతం నుంచి 18.9 శాతానికి స్వల్పంగా పెరిగిందని నివేదిక చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించిందని నివేదిక వెల్లడించింది. మరో చిత్రమేంటి అంటే మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో సైతం పురుషుల మద్యం వినియోగం 15.4 శాతం నుంచి 16.5 శాతానికి పెరగడం. ఇక ఏపీలో చూస్తే ఈ శాతం 23.1 నుంచి 23.3కు, తెలంగాణలో 43.4 నుంచి 43.9 శాతానికి చేరిందని నివేదిక పేర్కొంది.
ఆందోళన చెందాల్సిందే :
ఈ సర్వే నివేదిక మీద ఐసీఎంఆర్-ఎన్‌ఐసీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ షాలిని సింగ్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన విషయమే అన్నారు. అనేక రాష్ట్రాలలో ఇది ప్రధాన సమస్యగా మారి తీవ్రంగా ఉందని అన్నారు. అందువల్ల ప్రతి రాష్ట్రం, అలాగే ప్రతీ జిల్లాకు ప్రత్యేకమైన కార్యాచరణ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గర్భిణుల్లో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించాలని దానికి గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో కౌన్సెలింగ్ సేవలను విస్తృతం చేయాలని ఆమె చెప్పారు. అంతే కాదు ఈ తరహా పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల వంటి అసంక్రమిత వ్యాధులు పెరగడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వైద్య రంగంలోని ప్రముఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.