వర్షాకాల పార్లమెంట్ ఖర్చు...వామ్మో అనాల్సిందే !

చట్ట సభలు అంటే చర్చలకు వేదికగా ఉంటాయి. ప్రజా సమస్యలను అక్కడ చర్చిస్తారు. కోట్లాది మంది ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరించే పవిత్ర వేదికగా పార్లమెంట్ ని అసెంబ్లీని చూస్తారు.

Update: 2026-08-14 03:46 GMT

చట్ట సభలు అంటే చర్చలకు వేదికగా ఉంటాయి. ప్రజా సమస్యలను అక్కడ చర్చిస్తారు. కోట్లాది మంది ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరించే పవిత్ర వేదికగా పార్లమెంట్ ని అసెంబ్లీని చూస్తారు. లక్షలాది మంది ప్రజలు తమ తరఫున ప్రజా ప్రతినిధిని ఎన్నుకుని ఓటేసి పంపిస్తారు. అలా వచ్చిన వారు తమ నియోజకవర్గం సమస్యలు అక్కడ ప్రస్తావించి సరైన పరిష్కారం రాబడితే సార్ధకత చేకూరుతుంది. అంతే కాదు పార్లమెంట్ అయితే దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు సభ్యుల అందరి సలహా సూచనలతో తీసుకోవడం ద్వారా ప్రగతి బాటలు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలు అయితే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ సభలో చర్చలు జరపాల్సి ఉంది.

సభ అంటే రభసేనా :

అయితే చట్ట సభలు ఆ దిశగా సాగుతున్నా అంటే జవాబు అందరికీ తెలిసిందే. మధ్యలో రాజకీయం చొరబడుతోంది. ఒకసారి ఎవరైనా ప్రజా ప్రతినిధి అయ్యాక అయిదేళ్ళ వరకూ ఎన్నికలూ రాజకీయాలు ప్రస్తావన లేకుండా ప్రజలు వారి సమస్యలు పరిష్కారాలు అభివృద్ధి మీదనే దృష్టి కేటాయించాల్సి ఉంటుంది. ఒకరు అధికారంలో ఉంటారు, ఇవతల విపక్షంలో కొన్ని పార్టీలు ఉంటాయి. అందరి లక్ష్యం అంతిమంగా ప్రజా ప్రయోజనాలే కావాలి. కానీ అలా లేకపోవడమే బాధాకరం అని అంటున్నారు. చట్ట సభలు వేదికగా రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళూ చోటు చేసుకుంటున్నాయి. తమ డిమాండ్లు పట్టుదల కోసం సభా సమయాన్ని వృధాగా చేస్తున్నారు. అంతే కాదు సభను వాయిదాలు వేయించేలా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో సజావుగా సభలు సాగడం లేదు.

ప్రజల పన్నులతోనే :

పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా నడిచేది ప్రజలు కట్టే పన్నులతోనే. చట్ట సభలు ఒక రోజు నడవాలీ అంటే కోట్లలోనే ఖర్చు అవుతుంది. అదంతా ప్రజా ధనం అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇక చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిసాయి. మొత్తం పందొమ్మిది పని దినాలుగా ఈ సెషన్ ని నిర్వహిస్తే ఒక్క రోజు కూడా సజావుగా సభ సాగకపోవడం విశేషం. మరి ఈ పార్లమెంట్ వర్షాకాల సెషన్ కోసం అయిన ఖర్చు ఎంతో తెలిస్తే ఎవరైనా నోళ్ళు వెళ్లబెడతారు. ఈ మొత్తం పందొమ్మిది రోజులకు కలిపి రెండు వందల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయినట్లుగా చెబుతున్నారు.

నిముషానికి లక్షలే :

అంతే కాదు పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రతి నిమిషానికి సుమారు రూ. 2.5 లక్షలు ఖర్చవుతుంది. సాధారణ అంచనాల ప్రకారం పార్లమెంట్ సభల నిర్వహణకు రోజుకు దాదాపు రూ. 9 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే నిమిషానికి: రూ. 2.5 లక్షలు గంటకు రూ. 1.5 కోట్లు రోజుకు 9 కోట్లు ఇలా సభ జరిగే రోజుల బట్టి ఈ ఖర్చులు పెరుగుతూ ఉంటార్యు. వీటితో పాటు ఎంపీల జీతభత్యాలు, భద్రత, సిబ్బంది ఖర్చులు భవన నిర్వహణ వంటివి ఉంటాయి. ఇక సభలో గందరగోళం కారణంగా వాయిదాలు పడితే, ఆ వృధా అయిన సమయానికి కూడా ఇదే ప్రాతిపదికన కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టం జరుగుతుంది.

అంతా కట్టుబడి ఉండాలని :

మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనం వెచ్చించి నిర్వహించే సభలలో అర్ధవంతమైన చర్చలు జరగకపోతే నష్టం ఎవరికి అంటే కచ్చితంగా ప్రజలకే అని చెప్పాల్సి ఉంటుంది. అధికార విపక్షాలు పట్టుదలకు పోతూ సభా సమయాన్ని వృధాగా పోనిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రజా స్వామ్య ప్రియులు అయితే ఈ వైఖరి మంచిది కాదని అంటున్నారు. బీఏసీలో అంశాలకు అంతా కట్టుబడి ఉండాలని అంటున్నారు. అలాగే విపక్షాలు అత్యవసరం అని ఏదైనా అంశాన్ని మధ్యలో సూచించినా దాని ప్రాధాన్యత బట్టి తీసుకుంటే సభలో గందరగోళం వంటివి తగ్గుతాయని సూచిస్తున్నారు. మరి ఈసారి జరిగే సమావేశాలు అయినా సాఫీగా తాపీగా జరుగుతాయని ఆశించడమే సగటు భారతీయ పౌరుల కర్తవ్యంగా చెప్పాలి.

Tags:    

Similar News