ఎమ్మెల్సీ బరిలోకి టీ-సాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్, పోడు భూములు తదితర అంశాలపై చర్చలు నిర్వహించి, ఆయా సమస్యలను గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

Update: 2026-08-14 05:28 GMT

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు టి-శాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దక్కేలా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలను కలిసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం సూత్రప్రాయంగా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. పద్దెనిమిది సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉన్న బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఢిల్లీలోనూ పనిచేస్తున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన ఆయన, విద్యార్థి దశలో ఎన్‌.ఎస్‌.యు.ఐలో నాయకుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. తదుపరి జర్నలిస్టుగా కొనసాగిన ఆయన, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై అనేక రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్, పోడు భూములు తదితర అంశాలపై చర్చలు నిర్వహించి, ఆయా సమస్యలను గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆయనను టి-సాట్ సీఈఓగా నియమించింది. గత రెండేళ్లుగా టి-శాట్‌లో విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం పలు కోచింగ్ కార్యక్రమాలు, విద్యా ప్రసారాలు చేపట్టడంతో పాటు సంస్థ విస్తరణకు చర్యలు తీసుకున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక అవకాశం దక్కేలాపార్టీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News