బాబ్బాబూ.. భారత్ ను వేడుకుంటున్న బంగ్లాదేశ్.. ఇప్పుడు తత్త్వం బోధపడింది..

అసలు ఈ కథ ఎక్కడిదాకా వచ్చిందంటే... బంగ్లాదేశ్ విద్యుత్ వ్యవస్థకు ఊపిరి పోసేది ఎల్ఎన్‌జీ. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో దాదాపు సగానికి పైగా ఈ గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచే వస్తుంది.

Update: 2026-08-14 00:30 GMT

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కరెంట్ దీపాలు ఆర్పిపడేసేంత "వెలుగు" జిలుగులు నడుస్తున్నాయి. విద్యుత్ సంక్షోభం అక్కడ ఏ స్థాయిలో ఉందంటే... ఏ క్షణంలో ఏ ఇంట్లో కరెంట్ పోతుందో.. ఏ షాపింగ్ మాల్ తలుపులు ముందే మూసేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. రోజుకు 9 నుంచి 10 గంటల పాటు "పవర్ కట్" మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చీకట్లో అలమటిస్తున్న పొరుగు దేశానికి ఇప్పుడు ఉన్నపళంగా మన భారత్ గుర్తుకొచ్చింది. "కొంచెం అదనంగా డీజిల్ పోయండి సార్... లేకపోతే మా పరిస్థితి అంధకారమే" అని ఢాకా మన వైపు ఆశగా చూస్తోంది. భారత్ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిన బంగ్లాదేశ్ మనల్ని కాదని మన శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాల పంచన చేరి భారత్ ను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అక్కడ సంక్షోభం వచ్చేసరికి భారత్ ను బాబ్బాబు అంటూ బతిమిలాడుతోంది.

అగ్గి రాజేసిన ఎల్ఎన్‌జీ.. చీకట్లో బంగ్లా

అసలు ఈ కథ ఎక్కడిదాకా వచ్చిందంటే... బంగ్లాదేశ్ విద్యుత్ వ్యవస్థకు ఊపిరి పోసేది ఎల్ఎన్‌జీ. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్‌లో దాదాపు సగానికి పైగా ఈ గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచే వస్తుంది. అలాంటి చోట 'ఎక్సెలరేట్ ఎనర్జీ' కి చెందిన ఎల్ఎన్‌జీ టెర్మినల్‌లో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. దాంతో గ్యాస్ సరఫరా సగానికి పడిపోయింది. "సరే ఓడల్లో గ్యాస్ తెప్పించుకుందాం" అంటే... ప్రతికూల వాతావరణం వల్ల ఆ నౌకలు సముద్రంలోనే ఉండిపోయాయి. ప్రకృతి కూడా 'కావాలనే' బంగ్లాదేశ్‌తో ఆడుకుంటున్నట్లుంది.

'ఫ్రెండ్‌షిప్' డీజిల్ ఉంటే.. భయం ఎందుకు?

2017లో షేక్ హసీనా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత్-బంగ్లాదేశ్ మధ్య 131 కిలోమీటర్ల పొడవైన "ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్" నిర్మించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే ఏటా 1.80 లక్షల మెట్రిక్ టన్నుల డీజిల్ సైలెంట్‌గా బంగ్లాదేశ్‌కు చేరుతోంది. అయితే ఇప్పుడు పవర్ కట్స్‌తో కోలుకోలేని దెబ్బతిన్న ఢాకా "ఆ పైప్‌లైన్ ద్వారా కాస్త అదనంగా డీజిల్ పంపించకూడదూ?" అని భారత్‌ను రిక్వెస్ట్ చేస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాకిస్తాన్, చైనాతో అంటకాగుతూ వారిని ఆశ్రయించాల్సింది పోయి.. రాజకీయంలో ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా కరెంట్ పోయినప్పుడు మాత్రం పొరుగున ఉన్న "పెద్దన్న" భారతే దిక్కు అని బంగ్లాదేశ్‌కు మరోసారి నిరూపణ అయ్యింది.

ఇండియా ఏమంటుందో చూడాలి మరి

ఇప్పటికైతే బంగ్లాదేశ్ పంపిన ఈ డీజిల్ అర్జీపై భారత్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పైప్‌లైన్ రెడీగా ఉంది కాబట్టి డీజిల్ ఇవ్వడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మన "ఇంధన దాతృత్వం" ఎంతవరకు పనిచేస్తుందో బంగ్లాదేశ్ కష్టాలను భారత్ ఎంత వేగంగా కడిగేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా చీకటి పడితే దీపాలు వెలగాలన్నా ఫ్యాన్లు తిరగాలన్నా ఇప్పుడు భారత్ ఇచ్చే డీజిల్ చుక్కలే కీలకం.

Tags:    

Similar News