ఎన్టీఆర్ మేనకగా శ్రీదేవికి చాన్స్ మిస్

ఈ మూవీలో మేనకగా శ్రీదేవిని అనుకున్నారు. ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ కాంబో కాబట్టి వర్కౌట్ అవుతుందని భావించారు.

Update: 2026-08-13 18:07 GMT

సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. ఎన్టీఆర్ తో శ్రీదేవి కలసి నటించిన తొలి చిత్రం వేటగాడు. 1979లో ఈ మూవీ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. అంతకు ముందు ఆరేళ్ల క్రితం అంటే 1973లో బడిపంతులు మూవీలో ఎన్టీఆర్ తాతగా నటిస్తే శ్రీదేవి బాలనటిగా మనవరాలిగా ఆయన సరసన నటించింది. అలాంటి శ్రీదేవి ఎన్టీఆర్ జోడీ అంటే అది అప్పట్లోనే పెను సంచలనం. వేటగాడు మూవీ నాటికి ఎన్టీఆర్ ఏజ్ సరిగ్గా 57 ఏళ్ళు. శ్రీదేవి వయసు 16 ఏళ్ళు మాత్రమే. అంటే 41 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది అన్న మాట.

మాకు పాతికేళ్ళే :

శ్రీదేవిని ఎన్టీఆర్ కి జోడీగా తీసుకోవాలని చిత్ర నిర్మాతలు అనుకున్నపుడు ఆ విషయం దర్శకుడు కె రాఘవేంద్రరావు రామారావుని వినిపించారుట. శ్రీదేవి మీ పక్కన హీరోయిన్ గా తీసుకుంటున్నామని ఆయన చెబుతూ ఆమెకు పదహారేళ్ళు అంటే మాకు మాత్రం ఎక్కువేంటి జస్ట్ పాతికే అని ఎన్టీఆర్ హాస్యాన్ని పండించారుట. అలా సూపర్ డూపర్ హిట్ జోడీ ఎన్టీఆర్ శ్రీదేవి టాలీవుడ్ లో అప్పట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఇక ఈ ఇద్దరి జోడీతో 12 సినిమాలు రిలీజ్ అయితే దాదాపుగా అన్నీ హిట్లు సూపర్ హిట్లుగానే నమోదు అయ్యాయి. అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ గా వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటివి ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో కూడా శ్రీదేవి నటించింది. అనురాగ దేవత బిగ్ హిట్ అయితే రౌడీ రాముడు కొంటె కృష్ణుడు హిట్ అయింది. అగ్గి రవ్వ మూవీ ఏవరేజ్ గా నిలిచింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో :

ఇక ఎన్టీఆర్ 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు తిరిగి 1989 దాకా ఆయన రాజకీయాల్లోనే ఉంటూ వచ్చారు. అయితే 1989 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ తీయాలని సంకల్పించారు. అప్పట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా ఉండేవారు. జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. అందుకే తెలుగు హిందీ భాషలలో ఈ మూవీని రిలీజ్ చేసి ఆపైన దేశమంతటా పర్యటించాలని అనుకున్నారు. వీలైతే జాతీయ రాజకీయాల్లో టీడీపీని టాప్ రేంజిలో నిలబెట్టాలని కూడా యత్నించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండేది. దాంతో ఎన్టీఆర్ ఢీ కొట్టారు. ఈ క్రమంలో ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ సినిమా ముహూర్తం షాట్ కి దేశంలోని జాతీయ పార్టీల నుంచి ప్రతిపక్ష నేతలు హేమా హేమీలు వచ్చి గ్రీట్ చేయడం ఒక ముచ్చట.

మేనకగా శ్రీదేవి :

ఈ మూవీలో మేనకగా శ్రీదేవిని అనుకున్నారు. ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ కాంబో కాబట్టి వర్కౌట్ అవుతుందని భావించారు. అప్పటికే బాలీవుడ్ లో నంబర్ వన్ రేసులో దూసుకుని పోతున్న శ్రీదేవి ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఎన్టీఆర్ మూవీలో నటించేందుకు ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పేసింది అని అంటారు. ఆమె ప్లేస్ లో మేనకగా మీనాక్షీ శేషాద్రిని తీసుకున్నారు. అయితే శ్రీదేవి నో చెప్పడం మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆమె మీద రాజకీయ ఒత్తిడులు పనిచేసే ఈ విధంగా నటించకుండా చేశాయని ప్రచారం సాగింది. వాటి సంగతి అందులో నిజానిజాలు ఏమిటో తెలియదు కానీ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో మాత్రం బొబ్బిలి పులి మూవీ తరువాత మరోసారి రిపీట్ కాలేకపోయింది అని అభిమానులు బాధపడతారు. ఇక టాలీవుడ్ బాలీవుడ్ లలో తన తిరుగులేని నటనతో అందరినీ మెస్మరైజ్ చేసిన చాందినీగా అందరి గుండెలలో నిలిచిన శ్రీదేవి పుట్టిన రోజు ఆగస్టు 13. ఆమె దివికేగి ఇప్పటికి తొమ్మిదేళ్ళు గడిచాయి. అయినా ఆమెని అభిమాన జనంతో పాటు సినీ ప్రేమికులు ఎవరూ మరచిపోలేకపోవడమే నిజమైన నివాళిగా చెబుతున్నారు.

Tags:    

Similar News