తమిళనాడులో దళపతి విజయ్ కొత్త రికార్డులు.. 100 రోజుల్లోనే లక్ష కోట్ల పెట్టుబడులు!
తమిళనాడు పారిశ్రామిక వాతావరణంపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.
తమిళనాడు సినీ రంగంలో కలెక్షన్ల రికార్డులతో సూపర్ స్టార్ గా ఎదిగిన దళపతి విజయ్ రాజకీయాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి వంద రోజుల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి దళపతి సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం, 'వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్‌మెంట్ కాన్‌క్లేవ్ 2026' వేదికగా రాష్ట్రానికి రూ. 1.02 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన మైలురాయి రాష్ట్ర పారిశ్రామిక ప్రస్థానంలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు టీవీకే పార్టీ అభివర్ణించింది.
భారీగా ఉద్యోగ అవకాశాలు
తాజాగా జరిగిన కాన్‌క్లేవ్‌లో మొత్తం 97 కంపెనీలతో రూ. 67,452 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 104 ఎంఓయూల ద్వారా సుమారు 1,21,788 మందికి ఉపాధి లభించనుందని చెబుతున్నారు. ఇందులో కేవలం కాన్‌క్లేవ్ వేదికగా జరిగిన ఒప్పందాల ద్వారానే లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పెట్టుబడులు దాదాపు 15 రంగాలకు చెందిన 106 ప్రాజెక్టులకు సంబంధించినవి కావడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత మే నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చేసుకున్న వివిధ ఒప్పందాలతో రాష్ట్రానికి కొత్తగా లక్ష కోట్లు పెట్టుబడులు సమకూరినట్లు వివరించింది.
పెట్టుబడుల్లో అగ్రగామి డేటా సెంటర్లు
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులలో డేటా సెంటర్లకు అత్యధిక ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. ఏకంగా రూ. 26,417 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆటోమొబైల్ రంగంలో రూ. 17,073 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరులు రంగంలో రూ. 15,787 కోట్లు, ఇంజనీరింగ్ రంగంలో రూ. 9,525 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో పెట్టుబడులకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్లు చెబుతున్నారు.
పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ
తమిళనాడు ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని కేవలం ప్రధాన నగరాలకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఇందులో భాగంగా, 54 ప్రాజెక్టులు ప్రధాన పారిశ్రామిక జిల్లాలు కాని ప్రాంతాలలోనే ఏర్పాటు కానున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రామనాథపురం వంటి ప్రాంతాలకు రూ. 1,000 కోట్ల పెట్టుబడులు రావడం ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుందని చెబుతున్నారు. మొత్తం 19 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి
తమిళనాడు పారిశ్రామిక వాతావరణంపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. జపాన్, జర్మనీ, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా 16 దేశాలకు చెందిన సంస్థలు రూ. 22,268 కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానిస్తోంది. ఈ పెట్టుబడులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టకు నిదర్శనంగా నిలిచాయని ప్రకటించింది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతోనే ఈ పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రూ. 200 కోట్లు లేదా 5,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రత్యేక 'ఇన్వెస్టర్ ప్రమోషన్ కమిషన్' ఏర్పాటు చేయడం పారిశ్రామిక వర్గాలకు ఆకర్షించిందని అంటున్నారు. ముఖ్యంగా ఏ అభ్యర్థన అయినా 21 రోజుల్లో పరిష్కారం కాకపోతే, అది ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని ప్రభుత్వం ప్రకటించడంపై పారిశ్రామిక వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కాగా, టీవీకే ప్రభుత్వం సాధించిన ఈ విజయంపై పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన మాట్లాడుతూ, "ఈ మొదటి 100 రోజులు ఒక ఆరంభం మాత్రమే. 2036 నాటికి రాష్ట్ర జిడిపిని 1.5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యం. పెట్టుబడులను ఉద్యోగావకాశాలుగా, తద్వారా రాష్ట్ర అభివృద్ధిగా మార్చడమే మా ప్రధాన ఉద్దేశ్యం"గా ప్రకటించారు.