అపర చాణక్యుడు అమిత్ షా టార్గెట్ అయ్యారా ?
అమిత్ షాకు అపర చాణక్యుడు అన్న పేరు ఉంది. నరేంద్ర మోడీకి ఆయన వెన్నెముక అని చెబుతారు.
అమిత్ షాకు అపర చాణక్యుడు అన్న పేరు ఉంది. నరేంద్ర మోడీకి ఆయన వెన్నెముక అని చెబుతారు. మోడీ షాల బంధం ఈనాటిది కాదు, అది గుజరాత్ నుంచి మొదలై ఈ రోజున బలమైన స్నేహంగా మారి వట వృక్షంగా విస్తరించింది. గుజరాత్ లో కూడా మోడీ ముఖ్యమంత్రిగా ఉంటే అమిత్ షా హోం మంత్రిగా పనిచేశారు. ఈ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని మొత్తం శాసించేవారు. మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినపుడు సహజంగా అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పీఠం అధిష్టించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు, మోడీ వెంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
బీజేపీలో సర్వస్వంగా :
మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా రాజ్ నాధ్ సింగ్ ఉండేవారు. ప్రధానిగా మోడీ అయ్యాక బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం అమిత్ షా పరం అయింది. ఆ విధంగా ఆయన అయిదేళ్ళ పాటు పార్టీని శాసించి దేశంలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ బీజేపీ విజయాన్ని నమోదు చేసి కాషాయ జెండా నలు దిశలా ఎగిరేలా వ్యూహ రచన చేశారు. బీజేపీ అంటే అమిత్ షా మాత్రమే అన్నంతగా పార్టీ మీద పట్టు బిగించారు. బీజేపీని అయన తన కనుసైగతో నడిపించారు. పార్టీకి మిత్రులను కూడా కొత్తవారిని సమకూర్చి పెట్టారు. బీజేపీకి న్యూట్రల్ మిత్రులను కూడా తయారు చేయడం అమిత్ షా ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
హోం మంత్రిగా రికార్డు :
ఇక అమిత్ షా 2014 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయలేదు, కానీ 2019లో ఆయన తొలిసారి పోటీ చేశారు. అలా గెలిచి ఏకంగా కేంద్ర హోం మంత్రి అయ్యారు. ఈ రోజు దాకా అంటే గడచిన ఏడేళ్ళుగా ఆయన ఈ కీలక మంత్రిత్వ శాఖలో కొనసాగుతూ వస్తున్నారు. అది ఒక రికార్డుగా ఉంది. దేశంలో హోం మంత్రులుగా ఎంతో మంది చేశారు. అయితే ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఎవరికీ లేదు. ఆ రికార్డుని అమిత్ షా సొంతం చేసుకున్నారు. కాశ్మీర్ ని మూడు ముక్కలు చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ ని కాశ్మీర్ ని చేయడం కూడా అమిత్ షా వ్యూహం లో భాగం. అంతే కాదు ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకున్న 370 ఆర్టికల్ ని ఆయన రద్దు చేసి తన సత్తా చాటారు. అలా అభినవ సర్దార్ పటేల్ గా బిరుదుని అందుకున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వెనక అమిత్ షా చాణక్య రాజనీతి ఉంటుందని అంటారు.
పట్టు సడలుతోందా :
అటువంటి అమిత్ షా పట్టు అయితే ఇటీవల కాలంలొ సడలుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. అమిత్ షా అంటేనే ఉక్కు మనిషి అని అంటారు. అలాంటి ఆయన 19 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చివరి రోజున మాత్రమే హాజరయ్యారు. మిగిలిన రోజులలో విపక్షాలు ఎంత డిమాండ్ చేసినా రాలేదు. మరో వైపు చూస్తే తాను పార్లమెంట్ లో ప్రకటన చేస్తాను అని ఆయన చెప్పినా విపక్షం వద్దు అనడంతో మానుకున్నారు. ఇక కాంగ్రెస్ అయితే అమిత్ షానే టార్గెట్ చేస్తోంది. ఆయన రాజీనామా కోరుతోంది. ఈ విషయంలో విడిచిపెట్టేది లేదని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వెంటాడుతూనే ఉంటామని తమ డిమాండ్ నెరవేరేంతవరకూ ఉద్యమిస్తూనే ఉంటామని రాహుల్ గాంధీ తాజాగా ప్రకటించారు.
రాజీనామా కోసం పట్టు :
ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా అమిత్ షా రాజీనామా కోసం పట్టు పడుతున్నారు. అమిత్ షా సామాన్య నాయకుడు కాదు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి అలాగే బీజేపీకి ఆయన ప్రాణ వాయువు లాంటి వారు అలాంటి అమిత్ షానే రాజీనామా అడుగుతూ కాంగ్రెస్ రాజకీయ వేడి దేశమంతా రాజేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో తాజాగా విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం సభలో ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా విద్యార్థుల ఆందోళనలపై స్పష్టమైన సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు లాఠీచార్జీలకు కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్ధుల ఆందోళనలలో జరిగిన హింసకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థి ఆందోళనలపై జరిగిన పోలీసు దౌర్జన్యం హింసకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
సరిగ్గానే గురి పెట్టి :
కాంగ్రెస్ అయితే ఇపుడు రాజకీయ వ్యూహాలలో పదును తేరింది. విద్యార్ధుల ఉద్యమం నేపథ్యంలో అమిత్ షాని రాజీనామా కోరుతోంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన కూడా మోడీ షాలకు అత్యంత సన్నిహితుడు. ఆ విధంగా ఎన్డీయేకు బిగ్ షాక్ తగిలింది. ఇపుడు అమిత్ షా రాజీనామా డిమాండ్ తో ముందుకొచ్చింది. ఇది జరిగినా జరగకపోయినా బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ఎంచుకున్న రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇప్పటిదాకా ఇంతటి రాజకీయ ఒత్తిడిని అమిత్ షా ప్రతిపక్షం నుంచి ఎదుర్కోలేదు, తొలిసారి ఆయన కార్నర్ అవుతున్నారు. మరి అపర చాణక్యుడు ఏ విధంగా బయటపడతారు అన్నదే చూడాల్సి ఉంది.