మేము శివుడి భ‌క్తులం.. నార్త్ ఇండియన్స్ రాముడి భ‌క్తులు.. చిచ్చు రాజేసిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర భావోద్వేగ, ప్రాంతీయ, సాంస్కృతిక అంశాల చుట్టూ వేడెక్కుతున్నాయి.

Update: 2026-09-29 05:10 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర భావోద్వేగ, ప్రాంతీయ, సాంస్కృతిక అంశాల చుట్టూ వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక మీడియా కాన్ క్లేవ్ లో పేదల దేవుడు శివుడని.. ధనికుల దేవుడు రాముడని.. తాము శివుడి భక్తులమైతే ఉత్తరాది ప్రజలు రాముడి భక్తులని, తాము ద్రావిడులమైతే ఉత్తరాదివాళ్లు ఆర్యులంటూ ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీ బీజేపీపై నేరుగా కాంగ్రెస్ గురిపెట్టిన రాజకీయ దాడిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను కేవలం సాధారణ మతపరమైన వ్యాఖ్యలుగా భావించాలా లేదా రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహంలో భాగంగా చూడాలా అనే అంశంపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది.

గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీ తన రాజకీయ ప్రచారంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ప్రధానంగా ఉపయోగిస్తోంది. దీనికి ప్రతిగా ‘హర హర మహాదేవ్’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా బీజేపీ రాజకీయాలకు భిన్నమైన ఒక సాంస్కృతిక-రాజకీయ నేరేషన్‌ను నిర్మించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అని నినదిస్తారు కానీ ఎప్పుడైనా హర హర మహాదేవ్ అన్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించడం ద్వారా బీజేపీకి ఉన్న హిందుత్వ రాజకీయాలపై రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు శివుడిని పేదల దేవుడిగా.. రాముడిని ధనికుల దేవుడిగా చూపించే ప్రయత్నం అత్యంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలలో రాముడు, శివుడు ఇద్దరూ అత్యంత ఆరాధ్య దైవాలు. అలాంటప్పుడు ఒకరిని ధనికులకు, మరొకరిని పేదలకు ప్రతీకలుగా వర్గీకరించడం వెనుక రాజకీయ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక అసమానతలు, సామాజిక గుర్తింపు, ప్రాంతీయ భావోద్వేగాలను హిందూ మతపరమైన ప్రతీకలతో అనుసంధానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే మేము ద్రావిడులం, వారు ఆర్యులు అనే వ్యాఖ్య కూడా దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా నడుస్తున్న సున్నితమైన అంశాన్ని స్పృశిస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని ఒక జాతీయ పార్టీగా కాకుండా ఉత్తర భారత రాజకీయ సంస్కృతికి ప్రతినిధిగా ప్రజల్లో ప్రొజెక్ట్ చేసేలా రేవంత్ రెడ్డి వ్యూహం ఇందులో ఉందనే చర్చ జరుగుతోంది. ఉత్తరాది రాజకీయ ప్రభావం, దక్షిణాది ప్రాంతీయ అస్మిత వంటి అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తనకు అనుకూలమైన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.

అయితే ప్రత్యర్థి పార్టీని నిలువరించే క్రమంలో మతం, ప్రాంతం, ఆర్య-ద్రావిడ విభజన వంటి అంశాలను ముందుకు తీసుకురావడం కాంగ్రెస్‌కు రాజకీయంగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమేనని చెప్పవచ్చు. ఒకవేళ బీజేపీ ఈ వ్యాఖ్యలను హిందూ దేవుళ్లను లేదా ఉత్తరాది ప్రజలను అవమానించడంగా చిత్రీకరించి తీవ్రంగా ప్రచారం చేస్తే అది కాంగ్రెస్‌కే తిరిగి ఎదురుదెబ్బ తీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్చలు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, పెట్టుబడులు వంటి ముఖ్యమైన అంశాల నుంచి భావోద్వేగ అంశాల వైపు మళ్లడం వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఉంది.

రాజకీయాల్లో 'జై శ్రీరామ్' వర్సెస్ 'హర హర మహాదేవ్' నినాదాలు వేదికలపై పెద్ద శబ్దాలనే సృష్టించవచ్చు. కానీ రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసేది మాత్రం పాలన, సంక్షేమం, ఉద్యోగ కల్పన, ధరలు, నాయకత్వం వంటి ప్రాథమిక అంశాలే అని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఒక సభలో చేసిన సాధారణ వ్యాఖ్యలా లేక తెలంగాణలో బీజేపీ వ్యాప్తిని అడ్డుకోవడానికి రచించిన దీర్ఘకాలిక వ్యూహమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.. తెలంగాణ రాజకీయాల్లో ‘జై శ్రీరామ్’కు ‘హర హర మహాదేవ్’ కౌంటర్‌గా మారితే.. ఇది కేవలం నినాదాల పోరు కాకుండా వచ్చే ఎన్నికల ముందు భావోద్వేగ రాజకీయాల కొత్త అధ్యాయానికి తెరతీసే అవకాశం ఉంది.



Tags:    

Similar News