ఈసీ రచ్చ...వైసీపీలో కొత్త ఆశలు !
జగన్ తో పాటుగా ఆ పార్టీ నేతలు అంతా ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మీద విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కాలేదని అంటున్నారు.
అనూహ్యంగా జాతీయ స్థాయిలో ఈసీ వ్యవహార శైలి మీద రాజకీయ రచ్చ రాజుకుంది. అది రోజు రోజుకీ పీక్స్ కి చేరుకుంటోంది. విపక్షాలు అన్నీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి. సుప్రీం కోర్టు విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో ఎన్నికల సంఘం పని తీరు మీద ఎంతో కొంత చర్చ అయితే సాగుతోంది. ఏపీలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోంది. అందుకే చాలా స్పీడ్ గా జగన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సంఘం పనితీరు పారదర్శకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో కూడా న్యూట్రల్ విధానం ఉండాలని కూడా సూచించారు.
వైసీపీ స్టాండ్ :
జగన్ తో పాటుగా ఆ పార్టీ నేతలు అంతా ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మీద విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కాలేదని అంటున్నారు. ఆనాడు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి రెండు దాకా పోలింగ్ జరగడం ఏకంగా 40 లక్షల ఓట్లు సునామీ మాదిరిగా ఈవీఎంలలో చేరిపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది అని అన్నారు. ఇక వైసీపీ నేతలు అంతా ఇదే విధంగా స్పందిస్తున్నారు. 40 శాతం ఓటు షేర్ వచ్చిన పార్టీకి బొత్తిగా 11 సీట్లు రావడమేంటి అని లాజిక్ పాయింట్ ని జనంలోకి పంపిస్తున్నారు. ఒక విధంగా ఏపీలో 2024 ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదు అన్న తన బలమైన వాదనను గతం కంటే ఎక్కువగా వైసీపీ ఇపుడు వినిపిస్తోంది.
అస్త్రంగా మారుతున్నాయా :
ఈసీ మీద విపక్షాల విమర్శలు అన్నీ కూడా ఏపీలో వైసీపీకి అస్త్రంగా మారుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో తాము ఓటమి చెందలేదని ఈవీఎంల మహిమ అని నిన్నటిదాకా సెటైర్లు పేల్చిన వైసీపీ నేతలకు ఇపుడు ఒక విధంగా ఎంతో కొంత ఆధారంగా ఈ రచ్చ ఉందని అంటున్నారు. అందుకే ఇదే వాదనను జనంలోకి ఆ పార్టీ పంపిస్తోంది అని చెబుతున్నారు. ఇక్కడ మూడు విధాలుగా వైసీపీ ప్రయోజనం ఆశిస్తోంది. ఒకటి తమ పార్టీ ఎన్నికల అక్రమాల వల్లనే ఓటమి పాలు అయింది అన్న సందేశాన్ని వినిపించడం, రెండవది జనంలో వీలైనంతవరకూ ఈ అంశాన్ని చర్చలో పెట్టడం ద్వారా కూటమి గెలుపు మీద నైతికతను బలహీనపరచడం, మూడవది రానున్న కాలంలో ఈసీ జోరుకు కళ్ళెం వేయడం అని విశ్లేషిస్తున్నారు.
ఇంత జరిగాక :
అయితే వైసీపీ ఆశిస్తోంది అని కాదు కానీ దేశవ్యాప్తంగా ఇంత రచ్చ జరిగాక కచ్చితంగా ఎన్నికల సంఘంలో సమీక్షలు మరింత కఠినంగా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా రేపటి రోజున విపక్షాల ఆందోళన మరింత ముదిరితే కచ్చితంగా పాత విధానం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ప్యానెల్ మెంబర్ గా వచ్చినా వస్తారు. అలా జరిగితే తమకు 2029 ఎన్నికల్లో లాభమే అని వైసీపీ అంచనా వేసుకుంటోంది. 2024 లో వ్యవస్థలను మేనేజ్ చేశారు అన్నది వైసీపీ ఇప్పటికీ వినిపిస్తున్న వాదన. 2029 నాటికి అలా జరిగే చాన్స్ ఉండదని నమ్ముతోంది. ఒక వేళ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతో కొంత చేయాలనుకున్నా జోరు మాత్రం గతంలో మాదిరిగా ఉండదని అందువల్ల తాము ఎన్నికల యుద్ధంతో విజేతలుగా బయటపడతామని ఆశలు పెంచుకుంటోంది. చూడాలి మరి ఈసీ వర్సెస్ విపక్షాలు అన్న జాతీయ రాజకీయ వార్ ఏ మలుపు తీసుకుంటుందో.