జూనియర్లకే మళ్ళీ చాన్స్...టీడీపీ అదే చర్చ ?
ఈ క్రమంలో జూనియర్లను యువ నేతలను ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తోంది. దానికి నిలువెత్తు ఉదాహరణ ఆ పార్టీ ఇటీవల కాలంలో ఇస్తున్న పదవులు అన్నీ వారికే అని చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ చాలా వాస్తవికంగా ఆలోచన చేస్తోంది అని చెప్పాలి. పార్టీ పుట్టి 43 ఏళ్ళు దాటింది. మరో మూడేళ్ల అధికారం చేతిలో ఉంది. అంటే 2029 నాటికి పార్టీకి 46 ఏళ్లు వస్తాయి. దానికి మరో 46 ఏళ్ళు కలిపి పార్టీ అంత బలంగా ఉండాలని అధినాయకత్వం కోరుకుంటోంది. దానికి ప్రాతిపదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ టీడీపీలో విత్తిన యువ రక్తం. 1982లో పాతిక ఏళ్ళున్న వారిని అందరినీ తెచ్చి పార్టీలో నేతలను చేశారు. ఈ రోజు దాకా వారే పార్టీకి పునాదిగా నిలబడి బలంగా విస్తరించారు. మరోసారి అలాంటి నాయకత్వం తయారు చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. ఈ క్రమంలో జూనియర్లను యువ నేతలను ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తోంది. దానికి నిలువెత్తు ఉదాహరణ ఆ పార్టీ ఇటీవల కాలంలో ఇస్తున్న పదవులు అన్నీ వారికే అని చెప్పాలి.
అత్యధికంగానే :
ఇక 2024 ఎన్నికల్లో చూస్తే అత్యధికంగా యువ నేతలకే ఎమ్మెల్యే టికెట్లను టీడీపీ ఇచ్చింది. అందులో అనేక మంది గెలిచి వచ్చారు. అలా ఈ రోజు టీడీపీలో అరవై మంది దాకా యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వారి నుంచే 2024 జూన్ 12న టీడీపీ కూటమి మంత్రివర్గంలో 17 మంది దాకా తీసుకుంది. ఇందులో కూడా చూస్తే పది మంది దాకా తొలిసారి గెలిచి వచ్చిన వారే కావడం విశేషం. ఇపుడు చూస్తే ఈ డిసెంబర్ నాటికి సరిగ్గా రెండున్నర ఏళ్లు కూటమి పాలనకు పూర్తి అవుతుంది. దాంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం అయితే సాగుతోంది. దాని కంటే ముందు స్థానిక ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది.
అపుడే ముహూర్తం :
స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నవంబర్ లలో పూర్తి అవుతాయి. ఈ ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరుని చాలా జాగ్రత్తగా టీడీపీ అధినాయకత్వం అంచనా వేయనుంది అని అంటున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను వారు ఎంతవరకూ నెరవేర్చారన్నది దగ్గరుండి పరిశీలిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ మంత్రుల పనితీరు విషయంలో ఎప్పటికపుడు మధింపు జరుగుతోంది అని గుర్తు చేస్తున్నారు. వారికి ర్యాంకులు కూడా ఇస్తున్నారు. పనితీరుని మార్చుకోవాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ విధంగా మారిన వారికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇపుడు స్థానికంగా పట్టు ఏ మేరకు ఉంది అన్నది రాజకీయ నాయకత్వం అందించే దిశగా జిల్లాలలో ఏ మేరకు నిలబడి సత్తా చాటుతున్నారు అన్నది కూడా చూస్తారని అంటున్నారు.
యువతకే చాన్స్ :
అయితే మంత్రి వర్గ విస్తరణ జరపడం ఖాయమని ప్రచారం అయితే సాగుతోంది. నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ ఇది జరుగుతుందని చెబుతున్నారు. ఎపుడు విస్తరణ జరిగినా మరోసారి యువ ఎమ్మెల్యేలకే చాన్స్ ఇస్తారని అంటున్నారు. వారి నుంచే కొత్త నాయకత్వం తయారు చేసుకోవాలన్న దూర దృష్టితోనే టీడీపీ ఇలా చేస్తోంది అని అంటున్నారు. 2029 ఎన్నికలు కానీ ఆ తరువాత పార్టీ భవిష్యత్తు కానీ పదిలంగా ఉండాలంటే పార్టీలో యువతను ప్రోత్సహించాలని గట్టిగా తీర్మానించుకున్నారని అంటున్నారు. అందువల్ల సీనియర్లకు అవకాశాలు అయితే పెద్దగా దక్కేది ఉండదని ప్రచారం సాగుతోంది.
అనుభవమే పెట్టుబడి :
అలాగని సీనియర్లను సైడ్ చేయరని వారి అనుభవాన్ని పార్టీ కోసం పూర్తి స్థాయిలో వాడుకుంటారు అని అంటున్నారు. ఇలా టీడీపీ సీనియర్లు జూనియర్ల మధ్య ఒక కచ్చితమైన విభజన చేసుకుంటూ వారి అందరినీ పార్టీ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని చూస్తోంది అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల టీడీపీ మరో యాభై ఏళ్ల దాకా తన రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించగలదని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం మీద ఇవి ఊహాగానాలు అనుకున్నా లేక ప్రచారం అనుకున్నా అర్ధమయ్యేది ఏంటి అంటే టీడీపీలో యువతకే పెద్ద పీట అని. అందువల్ల ప్రతిభను చాటుకుంటే చాలు అత్యున్నత పదవులు వారి సొంతం అవుతాయని అంటున్నారు.