సందట్లో సడేమియా.. ఎల్.పీ.యూలో సాగిన ఓ ‘దోపిడీ’ కథ

ప్రస్తుతం పోలీసులు, సిట్ దర్యాప్తు బృందం యూనివర్సిటీలో ఏం జరిగిందన్న దానిపై క్లారిటీకి రాలేదు. వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టారు.

Update: 2026-09-29 06:24 GMT

కోపంలో ఉన్న వాడు ఏమైనా చేస్తాడు.. పిచ్చోడి చేతిలో రాయిలాగా అనే సామెతను కొందరు డిస్కౌంట్ ఆఫర్ లా ఆ యూనివర్సిటీలో సొమ్ముచేసుకున్నారు. న్యాయం కోసం ధర్నా చేద్దామని రోడ్డెక్కిన కొందరు కిలాడీ ఆందోళనకారులు.. మధ్యలోనే అసలు లక్ష్యాన్ని మార్చి బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ లు.. తాజా మోడల్ ఫోన్లు, స్టైలిష్ షూలు ఎత్తుకెళుతుంటే నిరసనకు.. మిడ్ నైట్ ఆఫర్ సెల్ కి తేడా తెలియక స్థానిక వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

సందట్లో సడేమియాలాగా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ అంటూ పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్.పీ.యూ)లో చెలరేగిన హింసాకాండ కొందరికి దోపిడీకి ఆయుధమైంది. హాస్టల్ లో ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఊహించని మలుపు తిరిగింది. న్యాయం దక్కాలి అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు చివరకు షాపుల అద్దాలు పగలగొట్టాలి అనేంతగా హింసాత్మకంగా మార్చింది. దొరికినవి దొరికనట్టు షాపులను బద్దలు కొట్టారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి హైవేపై ధర్నాలు, రాళ్ల దాడులతో వాతావరణం బాగా వేడెక్కేసింది.

అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ రగడ మధ్యలో ఉన్నట్టుండి జలందర్ -ఫగ్వారా హైవేపై ఉన్న మాల్స్, దుకాణాల వైపు కొందరు అడుగులు వేశారు. అల్లర్ల ముసుగులో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్ లు.. తాజా మోడల్ మొబైల్ ఫోన్లు, స్టైలిష్ షూలు, ట్రెండీ బట్టలు ఎత్తుకెళ్లారు. ఈ తీరు చూస్తుంటే విద్యార్థుల నిరసనలకు.. ఉచిత వింటర్ సేల్ కి తేడా లేకుండా పోయిందన్న సెటైర్లు వినిపించాయి. అసలు ఈ నిరసనలకు ఏ సంబంధం లేని హైవేపై షాపుల యాజమానులు తమ సరుకు మాయమై, అద్దాలు ముక్కలవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం పోలీసులు, సిట్ దర్యాప్తు బృందం యూనివర్సిటీలో ఏం జరిగిందన్న దానిపై క్లారిటీకి రాలేదు. వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టారు. ఫోరెన్సిక్ టీంలు రంగంలోకి దిగాయి. యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ‘గ్యాంగ్ రేప్’ లాంటిది జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థినుల చేత ఓ వీడియో కూడా విడుదల చేయించారు.

అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఆ చెప్పిన విద్యార్థినులు ‘మాతో బలవంతంగా చెప్పించారు’ అని ఆరోపించడంతో ఈ కథ మొదటికొచ్చింది. దీంతో ఈ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నిజనిజాలు తేలడానికి సమయం పడుతుంది..

కానీ ఈలోపే హైవేపై ట్రాఫిక్ నిలిపివేయడం.. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం.. ఆర్టీసీ బస్సులు.. పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టడం.. ఏ తరహా విప్లవమో ఎవరికీ అర్థం కావడం లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కనపడిన ప్రతీ దాన్ని తలబెడితే నచ్చిన వస్తువును ఎత్తుకెళితే బాధితురాలికి న్యాయం జరుగుతుందా? లేక షాపింగ్ కోరిక తీరుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్ కు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించి.. పరీక్షలను వాయిదా వేసి అందరినీ ఇళ్లకు సాగనంపింది. ప్రస్తుతం మూడంచెల దర్యాప్తు నడుస్తోంది. అర్ధరాత్రి జరిగిన ‘ఫ్రీ షాపింగ్’ దోపిడీలపై దర్యాప్తు సాగుతోంది. నిరసనల్లో అసలు దోషులు ఎవరో తేలేలోపే.. అమాయకులు నష్టపోవడం సమాజంలో విచిత్రమైన ధోరణికి అద్దం పడుతోంది. న్యాయపోరాటానికి, లూటీకి మధ్య ఉన్న తేడాను ఇప్పటికైనా గుర్తించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.



Tags:    

Similar News