డైరెక్ట్ ఎలక్షన్స్...కూటమిలో తర్జన భర్జన

ఏపీలో 125 దాకా మున్సిపాలిటీలు కార్పోరేషన్స్ ఉన్నాయి. వీటికి చైర్మన్లు మేయర్ ఎన్నికలను డైరెక్ట్ పద్ధతిలో నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Update: 2026-08-14 03:15 GMT

లోకల్ బాడీస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. ఎపుడైనా ఎన్నికలకు మేము రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరో వైపు చూస్తే అన్ని సీట్లను తామే గెలుచుకుని 2024 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని కూటమి భావిస్తోంది. వందకు వంద సీట్లను గెలిచి వైసీపీ ప్రభావం ఏపీలో ఏమీ లేదని నిరూపించాలని కూటమి వ్యూహరచన చేస్తోంది. వైసీపీని పూర్తిగా కట్టడి చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరేయాలని చూస్తోంది.

డైరెక్ట్ ఎలక్షన్స్ వెనక :

ఏపీలో 125 దాకా మున్సిపాలిటీలు కార్పోరేషన్స్ ఉన్నాయి. వీటికి చైర్మన్లు మేయర్ ఎన్నికలను డైరెక్ట్ పద్ధతిలో నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు కూడా చైర్మన్లకు ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని చూస్తున్నారు. ఈ విధంగా చేస్తే అవిశ్వాసం తీర్మానం అంటూ పెట్టి మధ్యలో దింపే అవకాశాలు ఉండవు. అయిదేళ్ళ పాటు చైర్మన్లు మేయర్లు పూర్తి ధీమాతో పరిపాలన చేస్తారు. పైగా పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగితే తమకు అది అనుకూలంగా ఉంటుందని కూడా కూటమి అంచనా వేస్తోంది.

నేరుగా ఎన్నికలు అంటే :

అయితే డైరెక్ట్ ఎన్నికలు అంటే అందులో సానుకూలతతో పాటు ప్రతికూలత కూడా ఉంది అని అంటున్నారు. ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల విపక్షం నుంచి కూడా ఎవరైనా గెలిచే చాన్స్ ఉండొచ్చు అన్న చర్చ అయితే కూటమిలో సాగుతోంది. అదే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు అంటే కూటమికి ఒక వేళ మెజారిటీ సభ్యులు తగ్గినా కూటమి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా జత కూడతారు కాబట్టి ఏ ఒక్క చోట కూడా పదవి కోల్పోకుండా దక్కించుకోవచ్చు. అంతే కాదు వార్డు సభ్యుల ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మెంబర్ల ఎన్నికలు కానీ పరోక్ష ఎన్నికలు అంటే ఎంతో ఉత్సాహం చూపిస్తారు అని అంటున్నారు. ఎందుకంటే ఎవరికైనా చాన్స్ దక్కవచ్చు అన్నదే ఆ ఉత్సాహానికి కారణం అని అంటున్నారు. దాంతో అంతా కష్టించి మరీ పనిచేస్తారు అని అంటున్నారు. ఇక ముందే మేయర్ ఎవరో చైర్మన్ ఎవరో తెలిసిపోయాక అంతటి పట్టుదల ఉత్సాహం మిగిలిన సభ్యుల ఎన్నికల విషయంలో ఉంటుందా అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోందిట.

లుకలుకలు కూడానా :

ఇక అసంతృప్తులు లుకలుకలు బయల్దేరి సహాయ నిరాకరణ కూడా జరిగితే అది ఏకంగా మేయర్ లేదా చైర్మన్ల మెజారిటీ మీద కూడా ప్రభావం చూపించే చాన్స్ ఉందని అంటున్నారు. గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ విధంగా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే అన్నీ చూసుకునే డైరెక్ట్ ఎన్నికలకు కూటమి పెద్దలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ తర్జన భర్జనలకు తావు లేదని అంటున్నారు. అంతే కాదు కూటమికి ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉంది కాబట్టి కచ్చితంగా అన్ని సీట్లూ గెలుపు ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే డైరెక్ట్ ఎన్నికలు అంటే రాజకీయ లాభమే అని కూటమి భావిస్తూంటే తమకు కూడా ఇది అనుకూలిస్తుందని వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేయడమే అసలైన రాజకీయ ట్విస్ట్ అంటున్నారు.

Tags:    

Similar News