ఎంపీ గ్రాఫ్: పార్లమెంటులో ప్లస్.. నియోజకవర్గంలో మైనస్.. !
పార్లమెంట్ రికార్డుల ప్రకారం లక్ష్మీనారాయణ లోక్‌సభలో 94% అత్యుత్తమ హాజరు శాతాన్ని నమోదు చేసుకున్నారు. 2026 బడ్జెట్, వర్షాకాల సమావేశాల్లో ఆయన 100% హాజరయ్యారు.
రాయలసీమ జిల్లాల్లో అత్యంత కీలకమైన అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంటులో ప్లస్.. నియోజకవర్గంలో మైనస్ అనే విధంగా ఉన్నారా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణపై దాదాపు లక్షన్నర పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినా.. ప్రస్తుతం ఆ మేరకు గ్రాఫ్ పెరగడం లేదని టీడీపీలోనే చర్చ సాగుతోంది. కూటమి సమన్వయం విషయంలో ఆయన వెనుకబడ్డారని అంటున్నారు.
పార్లమెంట్ రికార్డుల ప్రకారం లక్ష్మీనారాయణ లోక్‌సభలో 94% అత్యుత్తమ హాజరు శాతాన్ని నమోదు చేసుకున్నారు. 2026 బడ్జెట్, వర్షాకాల సమావేశాల్లో ఆయన 100% హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సమస్యలపై స్పందన బాగానే ఉంది. తీవ్రమైన కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, నిధులు కేటాయించాలని ఆయన పార్లమెంట్‌లో గళమెత్తారు. జిల్లాలో తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై కేంద్ర మంత్రులను కలిసి వినతులు సమర్పించారు. కానీ.. ఆయా అంశాలు కార్యరూపం దాల్చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇక, నియోజకవర్గ పరిధిలోని అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినప్పటికీ.. వీరిలో ఒకరిద్దరి ఎమ్మెల్యేలతో ఎంపీకి విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. గతంలో గుంతకల్లు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వ్యవహారం పెద్ద ఎత్తున రచ్చకు దారితీసింది. ఇక, ఇప్పుడు కూడా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయలేక పోతున్నారన్న వాదనను లక్ష్మీనారాయణ ఎదుర్కొంటున్నారు.
అనంతపురం నియోజకవర్గ ప్రస్తుత రాజకీయాలను అధికార కూటమి బలం, అభివృద్ధి ప్రణాళికలు బాగానే ఉన్నా యి. కానీ, స్థానిక సమీకరణలు మాత్రం అంతగా సక్సెస్ కావడం లేదని చెబుతున్నారు. తన ఎంపీ లాడ్స్ నిధులను స్థానిక అవసరాలకు కేటాయిస్తున్నా.. ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. తనే సొంతగా మనుషులను నియమించుకోవడం కూడా ఎంపీకి మైనస్ అయిందని అంటున్నారు. ముఖ్యంగా బోయ/వాల్మీకి సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్ ఎంపీకి సవాల్‌గా మారింది. దీంతో అనంతపురం పార్లమెంటులో ఎంపీకి అనుకున్నంత ఇమేజ్ అయితే కనిపించడం లేదని లోకల్‌గా వినిపిస్తున్న మాట.