జగన్ పర్యటన.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పరామర్శల యాత్రలు ఇటీవల కాలంలో వివాదాలకు దారితీస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పరామర్శల యాత్రలు ఇటీవల కాలంలో వివాదాలకు దారితీస్తున్నాయి. శ్రీకాకుళంలో పర్యటించినప్పు డు.. మహిళా ఎస్సైపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారన్న కేసులు నమోదయ్యాయి. గుంటూరులో పర్యటించినప్పుడు ఓ వ్యక్తిపైనుంచి కారు వెళ్లిన ఘటన కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇలా.. జగన్ ఎక్కడ బయటకు వచ్చినా.. ఏదో ఒక వివాదం తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా కూడా ఇలాంటి పరిస్తితే ఉంటుందని పోలీసులు అనుమానించారు. అయితే.. ఈ దఫా ఎలాంటివివాదం లేకుండానే జగన్ పర్యటన ముగిసింది.
ఒంగోలుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు కాకుమాను రాజశేఖర్.. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఒంగోలుకు వెళ్లారు. సహజంగానే జగన్ వస్తున్నారంటే.. పార్టీ కార్యకర్తల సమీకరణ, ప్రదర్శన, రోడ్ షో, ర్యాలీ వంటివి ఉంటాయి. అలానే ఒంగోలులోనూ మంగళవారం ర్యాలీ, ప్రదర్శన చేపట్టారు. ఇక తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలుకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా.. కాకుమాను ఇంటికి వెళ్లారు. దారిపొడవునా.. ఆయన కారు ఫుట్ బోర్డుపై నిలబడి.. చేతులు రెండూ పైకెత్తి నమస్కరిస్తూ.. ముందుకు సాగారు.
ఈ క్రమంలో కార్యకర్తలు, నాయకులు భారీగా వచ్చారు. వందలాది మంది గుమిగూడారు. అయితే.. పోలీసులు ఈ వ్యవహారాన్నిముందుగానే గుర్తిం.. పక్కాగా బందోబస్తు నిర్వహించారు. దీంతో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేకపోవడం.. వివాదాలకు తావులేకపోవడంతో ర్యాలీ సాఫీగా సాగిపోయింది. పోలీసులు కూడా దాదాపు సంయమనం పాటించారు. ఎక్కడా వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఈ దఫా వైసీపీ కూడా జాగ్రత్తలు తీసుకుంది. కార్యకర్తలపై నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగానే నిర్వహించారని అంటున్నారు.
విషాదంలో నవ్వులు!
కాకుమాను కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాకుమాను కేవలం నాయకుడు కాదని.. పార్టీ కుటుంబంలో ఒకసభ్యుడని జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందన్నారు. అయితే.. ఈ సందర్భంగా విషాదంలో ఉన్న కుటుంబాన్ని జగన్ నవ్వుతూ పలకరించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన డీఎస్సీ-2025 ఆందోళనలో కాకుమాను పాల్గొన్నారు. అనంతరం ఇంటికిచేరుకున్నాక.. ఆయన గుండె పోటుకు గురై మృతి చెందారు.