రాజ‌కీయ సుడిలో విశాఖ మేయ‌ర్ పీఠం.. !

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపుతోంది.

Update: 2026-09-29 18:30 GMT

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారం రేపుతోంది. కొన్ని కార్పొరే షన్ల‌లో ముందుగానే నాయ‌కులు మేయ‌ర్ పీఠాల‌పై క‌ర్చీఫ్‌లు వేసేశారు. ఈ ప్ర‌భావం కూట‌మిలో క‌ల్లోలం రేపుతోంది. పైకి అంతా బాగానే ఉంద‌ని అనుకుంటున్నా.. అంత‌ర్గంగా మాత్రం నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు..పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారుతోంది. విశాఖ‌ప‌ట్నం కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠం వ్య‌వ‌హారం కూడా ఇలానే మారింది.

ప్రస్తుతం విశాఖ మేయర్ పీఠాన్ని బిజెపి ముఖ్య నాయకుడు గతంలో టిడిపిలో కీలక నేతగా వ్యవహరించిన సీఎం రమేష్ సతీమణి ఆశిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి బీసీ సామాజిక వర్గానికి విశాఖ మేయర్ పీఠాన్ని ఇవ్వాలని ఈ దఫా నిర్ణయం తీసుకున్నట్టుగా టిడిపిలో కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. దీంతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన కొందరు నాయకులు ఆ ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇంతలోనే అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ... త‌న సతీమణి శ్రీదేవి విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని మీడియాలో ప్రచారం రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి.

అసలు సీఎం రమేష్ వార్తలు ఏమిటనే విషయంపై టిడిపిలోనూ అంతర్గత చర్చ నడుస్తోంది. తనకు సంబంధం లేని తన నియోజకవర్గం కానీ విశాఖపట్నం కార్పొరేషన్ లో ఆయన ఏ విధంగా తన సతీమణి పోటీకి నిలబెడతారు అనేది కీలక చర్చగా మారింది. దీనిని బిజెపి నాయకులు స్వాగతిస్తుంటే మరోవైపు టిడిపిలో నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం సతీమణి శ్రీదేవి అనూహ్యంగా మేయర్ సీటుపై ఆసక్తి వ్యక్తం చేయడం కచ్చితంగా ఆమె పోటీ చేస్తారని గెలిపించుకుంటామని సీఎం రమేష్ అనుకూల వర్గం ప్రకటన చేస్తుండడం వంటివి విశాఖలో చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా ఈ విషయంపై ఎంపీ శ్రీ భరత్‌కు కొంతమంది టిడిపి నాయకులు మెమరాండం సమర్పించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని అది కూడా టిడిపి వరకే కేటాయించాలని కూడా వారు పట్టుబట్టడం గమనార్హం. ఇక విశాఖ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం జనసేన ఒక స్థానాన్ని బిజెపి ఒక స్థానాన్ని పంచుకోగా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ టిడిపి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యానికి తోడు టిడిపి బలంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటును టిడిపిలోనే ఉండాలని నాయకులు కోరుతున్నారు.. దీనిపై దృష్టి పెట్టాలని కూడా కొందరు అధిష్టానాన్ని కోరుతున్న వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందనేది చూడాలి.

Tags:    

Similar News