వైసీపీ విరాళాలు పాతాళానికి...మ్యాటరేంటి ?
రాజకీయ పార్టీలకు వివిధ వర్గాల నుంచి సంస్థల నుంచి విరాళాలు రావడం చట్టబద్ధంగానే కొనసాగే ప్రక్రియ.
రాజకీయ పార్టీలకు వివిధ వర్గాల నుంచి సంస్థల నుంచి విరాళాలు రావడం చట్టబద్ధంగానే కొనసాగే ప్రక్రియ. తమకు ఫలానా పార్టీ మీద అభిమానం ఉండి విరాళాలు ఇవ్వవచ్చు. లేదా భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ఆశించి కూడా ఫండ్స్ ఇవ్వవచ్చు. ఇలా వివిధ కారణాల వల్ల విరాళాలు రాజకీయ పార్టీలకు వస్తాయి. వీటిని ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు వివరించడం ద్వారానే ఆ ఫండ్స్ కి చట్ట బద్ధత వస్తుంది. ఈ విధంగా ఇరవై వేల రూపాయలకు మించి స్వీకరించే ప్రతీ విరాళం వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైసీపీ ప్రకటించిన విరాళాలో భారీ క్షీణత కనిపిస్తోంది. అంతకు ముందు ఏడాది కంటే పెద్ద ఎత్తున తగ్గుదల కూడా ఉంది.
వైసీపీ విరాళాలు ఇలా :
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూస్తే వైసీపీకి వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫండ్స్ చూస్తే కేవలం 24.31 కోట్ల రూపాయలు మాత్రమే అందాయని లెక్క చెబుతోంది. అంతకు ముందు ఏడాది వైసీపీకి విరాళాల రూపంలో 140.04 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే వైసీపీకి అందిన విరాళాలు దాదాపుగా 82 శాతం మేర తగ్గినట్లుగా ఈ లెక్కలు చూపిస్తున్నాయి. ఇది భారీ పతనంగానే విశ్లేషిస్తున్నారు. విరాళాలు ఒక రాజకీయ పార్టీకి ఎందుకు ఇస్తారు అన్నది వివిధ కోణాలలో విశ్లేషించుకోవచ్చు. ముఖ్యంగా ఆ పార్టీ మీద అభిమానం కొలమానంగా కూడా చూస్తారు. తమ పార్టీ అభివృద్ధి చెందాలని రాజకీయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆర్ధికంగా అండగా ఉంటూ ఫండ్స్ ఇస్తారు. మరి వైసీపీ విషయంలో కేవలం ఏడాదిలోనే అభిమానం కరిగిందా అన్న చర్చ మొదలైంది.
టీడీపీ విషయంలోనూ :
అయితే ఈ ఫండ్స్ క్షీణత అన్నది వైసీపీ విషయంలోనే కాదు అధికారంలో ఉన్న టీడీపీ విషయంలోనూ జరగడం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 58.25 కోట్ల రూపాయలు టీడీపీకి విరాళనగా వచ్చాయి. అదే 2024-25 లో అయితే 83.03 కోట్ల రూపాయలుగా ఈ మొత్తం ఉంది. ఇలా లెక్క కూడితే కనుక టీడీపీ దక్కిన విరాళాలలో సైతం దాదాపు 30 శాతం మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయితే టీడీపీకి 30 శాతం తగ్గితే వైసీపీకి 82 శాతం తగ్గింది. ఏపీ రాజకీయాల్లో పోటా పోటీగా ఉన్న ఈ పార్టీలు ఫండ్స్ విషయంలో మాత్రం భారీ వ్యత్యాసాలతో కొనసాగడం విశేషం. అయితే టీడీపీకి అత్యధికంగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి విరాళం లభించినట్లుగా నివేదిక చెబుతోంది.
అందుకే మందగమనం :
ఇపుడు ఏపీలో ఎన్నికలు లేవు, అంతే కాదు రాజకీయం కూడా వేడిగా లేదు. దాంతోనే ఫండ్స్ కూడా మందగమనంలో ఉన్నాయని విశ్లేషణలు ఉన్నాయి. మళ్లీ 2028 నాటికి రెండు పార్టీలకు విరాళాలు భారీగా ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు అని అంటున్నారు. అప్పటికి ఎన్నికల వేడి పెరగడమే కాదు 2029 ఎన్నికలు అధికారం మీద అంచనాలు కూడా చూసుకుంటూ విరాళాలు ఇచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అంటున్నారు. విరాళాలు ఎక్కువ వస్తే ఆదరణ ఉందని తక్కువ వస్తే నిరాదరణ అని ఎక్కడా కొలమానం లేదు కానీ విరాళాలు పార్టీలకు ఆర్థిక జీవనాడి కాబట్టి అవి తగ్గితే ఇబ్బందులు దైనందిన కార్యకలాపాలకు ఎదురవుతాయని అంటున్నారు.