సోషల్ మీడియాలో 'షో'.. రియల్ లైఫ్‌లో 'స్లో'.. జెన్ జెడ్ అసలు జాతకం ఇదే..
తాజాగా 'సాలరీ సే' అనే సంస్థ ఏకంగా 5.2 లక్షల మంది ఉద్యోగస్తులైన జెన్ జెడ్ వినియోగదారుల యూపీఐ లావాదేవీలను తవ్వి తీసి వారి ఆర్థిక జాతకాన్ని బయటపెట్టింది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు.. మన దేశంలో ఉన్న జెన్ జీ యువతంతా ప్రతి వీకెండ్ ఎంజాయ్ చేయడం .. రోజుకో హై-ఫై కేఫ్‌లో కోల్డ్ కాఫీలు తాగుతూ చెకిన్లు పెట్టడం.. కొత్త ట్రెండీ బట్టలతో రచ్చ చేయడమే పనిగా బతుకుతున్నారనిపిస్తుంది. "వీరికేం పోయేకాలం వచ్చింది బాబోయ్.. నయా పైసా పొదుపు లేదు.. 'లివ్ ఇన్ ది మూమెంట్' అంటూ డబ్బులన్నీ తగలేస్తున్నారు" అని ఇంట్లో పెద్దవాళ్లు రోజూ తలలు పట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆగండి బాస్.. ఈ రంగుల లోకం వెనుక ఉన్న అసలు సీన్ వేరే ఉంది. సోషల్ మీడియాలో పోజులు కొట్టే ఈ జెన్ జీ పాపలు, బాబులు బయటకు ఎంత బిల్డప్ ఇచ్చినా లోపల మాత్రం పరమ నార్మల్ మిడిల్ క్లాస్ మనస్తత్వంతో పైసా పైసా లెక్కచూసుకుని బతికేస్తున్నారనే బాంబు లాంటి నిజం తాజాగా బయటపడింది.
తాజాగా 'సాలరీ సే' అనే సంస్థ ఏకంగా 5.2 లక్షల మంది ఉద్యోగస్తులైన జెన్ జెడ్ వినియోగదారుల యూపీఐ లావాదేవీలను తవ్వి తీసి వారి ఆర్థిక జాతకాన్ని బయటపెట్టింది. ఆ గణాంకాలను చూసి విశ్లేషకులే మైండ్ బ్లాంక్ అయ్యారు. సోషల్ మీడియాలో వీళ్లు చూపించే లగ్జరీ లైఫ్‌స్టైల్ అంతా కేవలం జనం కళ్లల్లో దుమ్ము కొట్టే 'కవర్ డ్రైవ్' మాత్రమేనట.. ఈ తరం బడ్జెట్‌లో సింహభాగం పొట్టకూటికే సరిపోతోందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. వీరు సంపాదించే నెలవారీ ఆదాయంలో 20.1 శాతం కేవలం కరెంట్ బిల్లులు, రెంట్లు, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లకే సరిపోతుంటే మరో 15.7 శాతం కిరాణా సరుకులకు కరిగిపోతోంది. ఇక ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, తిండి తిప్పలకు 11.5 శాతం ఖర్చు అవుతోంది. ఇవన్నీ కలిపితే వీరు సంపాదించే దాంట్లో ఏకంగా 70 శాతానికి పైగా డబ్బులు పప్పులు, ఉప్పులు, అద్దెలు కట్టడానికే సరిపోతున్నాయి. బయటకు మాత్రం "ఐ లవ్ మై ఫ్రీడమ్" అని రీల్స్ చేస్తూ వెనుక మాత్రం ఇంటి ఓనర్ ఎప్పుడు కాల్ చేస్తాడో అని భయపడే పరిస్థితి వీరిది.
ఇక సోషల్ మీడియా బయోలో "పాషన్ ట్రావెలర్", "సోల్ సెర్చర్", "వాండర్‌లస్ట్" అని ప్రొఫైల్స్ నింపేసి కొత్త ప్రదేశాల ఫొటోలతో పిచ్చెక్కించే బ్యాచ్ అసలు రంగు కూడా ఇక్కడే బయటపడింది. జెన్ జీ నెలవారీ బడ్జెట్‌లో ప్రయాణాలకు కేటాయిస్తున్నది కేవలం 5 శాతం మాత్రమే.. అంటే ఏంటో తెలుసా? ఇన్స్టాలో కంటెంట్ కోసం ఏడాదికోసారి పోయిన ఒకే ఒక్క ట్రిప్‌ను.. వంద రకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఏడాది పొడవునా త్రోబ్యాక్ పిక్స్ అంటూ పోస్ట్ చేస్తూ కవర్ చేస్తున్నారన్నమాట. ప్రయాణాలు చేయాలని కోరికలు గుర్రాలై పరిగెడుతున్నా, బడ్జెట్ అనే పగ్గాలు మాత్రం వారిని గట్టిగా లాగి పడేస్తున్నాయి.
బయటకు వెళ్తే జేబు ఖాళీ అవుతుందని గ్రహించిన ఈ స్మార్ట్ తరం, డిజిటల్ వినోదానికి ఓటేస్తోంది. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి సబ్‌స్క్రిప్షన్లతో ఇళ్లల్లోనే బోర్ కొట్టకుండా సెటిల్ అవుతున్నారు. అంతటితో ఆగకుండా వయసు పెరిగే కొద్దీ జీవితం ఇచ్చే షాకులతో వీరు మరింత గట్టిగా మారడం విశేషం. 18 నుండి 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అవసరాలకు 50 శాతం ఖర్చు చేసే ఈ కుర్రాళ్లు 24 నుండి 29 ఏళ్లకు వచ్చేసరికి అప్పులు, ఈఎమ్‌ఐలు, కుటుంబ బాధ్యతలు తోడై ఆ ఖర్చును 59 శాతానికి పెంచుకుంటున్నారు. అంటే వయసు పెరిగే కొద్దీ "బాధ్యత" అనే బరువు భుజాలకెక్కి సోషల్ మీడియా పిచ్చి తగ్గి ఆర్థిక స్పృహ పెరుగుతోందన్నమాట.
మొత్తానికి చూస్తే సోషల్ మీడియాలో మెరిసేదంతా బంగారం కాదు, జెన్ జీ చేసేదంతా అజ్ఞానం కాదు. గ్లామర్ కావాల్సిందే.. కాదనడం లేదు. కానీ అది జేబుకు తూట్లు పొడవనంత వరకే.. వీళ్లు పొదుపు చేయని తరం కాదు.. సోషల్ మీడియా కోసం 'షో' చేస్తూనే.. వెనుక 'స్లో'గా బడ్జెట్ మేనేజ్ చేసే మహా మేధావులు..