నడి సంద్రంలో అమెరికన్ సైనికులకు నరకం.. సుదీర్ఘ యుద్ధంతో నైరాశ్యం

ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికా సైనికులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కథనాలు వస్తున్నాయి.

Update: 2026-08-14 06:14 GMT

ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికా సైనికులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కథనాలు వస్తున్నాయి. దాదాపు ఆరు నెలలుగా సముద్రంలోనే ఉండిపోవడంతో ఆహారం, తాగునీరు కొరత, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సైనికులు తీవ్ర నైరాశ్యానికి లోనవుతున్నారని చెబుతున్నారు. దాదాపు 250 రోజులుగా 5 వేల మంది సైనికులు అబ్రహం లింకన్ యుద్ధ నౌకలో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో పలువురు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, ఇటీవల ఆరుగురు సైనికులు సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని జరుగుతున్న ప్రచారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఇరాన్ తో యుద్ధంలో అమెరికా పడరాని పాట్లు పడుతున్నట్లు తాజా ఉదంతాలు చాటిచెబుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే క్షిపణుల కొరత కారణంగా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కానీ, అరేబియా సముద్రంలో మొహరించిన తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో సైన్యం మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా నావికా దళ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన కఠినమైన డిప్లాయ్‌మెంట్లలో ఒకటిగా 'యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్' ప్రయాణం నిలుస్తోందని చెబుతున్నారు.

సుమారు 5,000 మందికి పైగా సిబ్బంది, నావికులు మెరైన్లు ఎటువంటి విరామం లేకుండా 250 రోజులకు పైగా సముద్రంపైనే గడపడం వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి యుద్ధనౌకలు నిర్ణీత కాలం తర్వాత తీరానికి చేరుకోవాల్సి ఉంటుంది, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాల వల్ల ఈ నౌక డిప్లాయ్‌మెంట్ పదేపదే పొడిగింపునకు గురవడంతో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.

అమెరికాకు చెందిన నేవీ టైమ్స్, స్టార్స్ అండ్ స్ట్రైప్స్ వంటి సైనిక పత్రికల కథనాల ప్రకారం, నౌకలోని సిబ్బంది మధ్య తీవ్రమైన మానసిక వేదన నెలకొంది. తమను తాము నియంత్రించుకోలేక కొందరు నావికులు సముద్రంలోకి దూకేసేందుకు ప్రయత్నించినట్లు కథనాలు ప్రచురించాయి. ఒకరిద్దరిని తోటి సిబ్బంది అప్రమత్తమై కాపాడగా, మరికొందరు ఇలాంటి తీవ్ర ఆలోచనలతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు "రేపు పొద్దున్న లేవకూడదని కోరుకుంటున్నాను" అని చెబుతున్నారని, వారి మానసిక స్థితి ఎంత దయనీయంగా ఉందో కుటుంబీకులు వాపోతున్నారు.

కనీస సౌకర్యాల కోసం పోరాటం

మానసిక ఒత్తిడికి తోడు, నౌకలో నెలకొన్న పరిస్థితులు నావికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విరిగిన మరుగుదొడ్లు, పనిచేయని ఏసీ వ్యవస్థలు, లాండ్రీ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు సిబ్బందికి నరకప్రాయంగా మారాయని చెబుతున్నారు. అంతేకాకుండా, ఆహార కొరత, వేడి నీళ్లు లేకపోవడం, పరిశుభ్రత లోపించడంపై డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ లెవిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. సైనికులు దేశం కోసం పనిచేస్తుంటే, వారికి కనీసం కడుపు నిండా భోజనం, శుభ్రమైన మరుగుదొడ్డి సదుపాయం కల్పించలేకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.

కుటుంబాల నిరసన

ఇటీవల శాన్ డియాగోలో జరిగిన ఒక టౌన్ హాల్ సమావేశంలో సుమారు 200 మందికి పైగా నావికుల కుటుంబ సభ్యులు నావికా దళ ఉన్నతాధికారులను నిలదీశారు. తమ వారి ప్రాణాలకు భరోసా ఏదని, ఈ అనిశ్చిత పరిస్థితులు వృత్తి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని వాపోయారు. అయితే, అమెరికా నావికా దళం అధికారికంగా స్పందిస్తూ, సిబ్బందిలో ఆత్మహత్యాయత్నాలు లేదా ఆత్మహత్య ఆలోచనలు పెరిగినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. నౌకలో మానసిక నిపుణులు, కౌన్సెలర్లు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News