ఎముకలు విరిగితే ఇకపై నో టెన్షన్.. 3 నిమిషాల్లోనే!
ఎముకలు విరిగితే నెలల తరబడి ప్లాస్టర్ వేయడం లేదా ఆపరేషన్ చేసి రాడ్లు, స్క్రూలు పెట్టడం మనకు తెలుసు.
ఎముకలు విరిగితే నెలల తరబడి ప్లాస్టర్ వేయడం లేదా ఆపరేషన్ చేసి రాడ్లు, స్క్రూలు పెట్టడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన కొత్త ఆవిష్కరణను ప్రకటించారు.కేవలం 3 నిమిషాల్లోనే విరిగిన ఎముకలను అతికించే ‘బోన్-02’ అనే పవర్‌ఫుల్ బయో-గ్లూను తయారు చేశారు. సముద్రపు ఆలుచిప్పల నుండి ప్రేరణ పొంది రూపొందించిన ఈ ‘బోన్ అడెసివ్’ వైద్య రంగంలోనే ఒక విప్లవంగా మారుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం.
ఆలుచిప్పల నుండి అద్భుతం:
చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త గ్లూను అభివృద్ధి చేశారు. సముద్రంలో ఆలుచిప్పలు నీటి అడుగున తడి ఉపరితలాలకు ఎంత బలంగా అతుక్కుంటాయో గమనించి, అదే టెక్నాలజీని ఎముకల చికిత్సలో వాడారు. ఇక సాధారణంగా రక్తంతో తడిగా ఉండే ఎముకలపై గ్లూ పనిచేయడం కష్టం, కానీ ఈ ‘బోన్-02’ తడి వాతావరణంలో కూడా సెకన్ల వ్యవధిలోనే ఎముకలను గట్టిగా పట్టేస్తుంది.
మూడు నిమిషాల్లోనే ఫిక్స్:
ఈ చికిత్స విధానం చాలా సులభం. ఎముక విరిగిన చోట ఒక చిన్న గాటు (ఇన్సిషన్) పెట్టి, ఈ గ్లూను ఇంజెక్ట్ చేస్తారు. కేవలం 2 నుండి 3 నిమిషాల వ్యవధిలోనే ఇది గట్టిపడి, విరిగిన ఎముక ముక్కలను ఒకదానికొకటి బలంగా అతుక్కునేలా చేస్తుంది. దీనివల్ల గంటల తరబడి జరిగే క్లిష్టమైన సర్జరీల అవసరం తప్పుతుంది.
ప్రయోజనాలు ఏంటంటే?రాడ్లు, స్క్రూల గోల ఉండదు:
సంప్రదాయ పద్ధతుల్లో వాడే మెటల్ ప్లేట్లు, స్క్రూలతో పనిలేదు. ఇక రెండో సర్జరీ అవసరం లేదు, ఎముక పూర్తిగా కోలుకున్నాక, శరీరంలో ఉన్న గ్లూ క్రమంగా కరిగిపోతుంది. కాబట్టి లోపల ఉన్న రాడ్లను తీయడానికి మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు.ఇక ప్లాస్టర్ బెడద తక్కువగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా తమ పనులు చేసుకోగలుగుతారు. అంతేకాక ఇన్‌ఫెక్షన్ల భయం తక్కువ, సర్జరీ సమయం తక్కువ కావడంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది.
క్లినికల్ ట్రయల్స్ సక్సెస్:
ఇప్పటికే చైనాలో 150 మందికి పైగా రోగులపై ఈ గ్లూను పరీక్షించి విజయవంతమైన ఫలితాలను సాధించారు. ముఖ్యంగా మణికట్టు దగ్గర విరిగిన ఎముకలను ఈ గ్లూతో అతికించగా, కేవలం మూడు నెలల్లోనే వారు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు 180 కిలోల బరువును సైతం తట్టుకోగల సామర్థ్యం ఈ గ్లూకు ఉండటం విశేషం.
వైద్య రంగంలో వస్తున్న ఇలాంటి ఆవిష్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయి. భవిష్యత్తులో ఈ ‘బోన్-02’ గ్లూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే, ఎముకలు విరిగిన వారు నెలల తరబడి మంచానికే పరిమితం అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక మెటల్ రాడ్ల నొప్పి లేకుండానే ఎముకలను అతికించే ఈ టెక్నాలజీ నిజంగా ఒక వరమే అని చెప్పాలి.