తిరుమల లడ్డూలో ఏం వాడారు? భక్తుల ఆరోగ్యానికి నష్టమెంత?

తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-31 04:30 GMT

తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా సిట్ ఇచ్చిన రిపోర్టు మీద ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. గతంలో నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఆరోపించిన అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. తాజా సిట్ రిపోర్టులో అవేమీ లేవని చెప్పిన మీదట వారి అప్పటి మాటలు మహోపచారంతో సమానమని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కూటమి వర్గాలు అంతే ధీటుగా బదులిస్తున్నాయి.

ఇలాంటి వేళ.. సిట్ తన రిపోర్టులో నెయ్యికి సంబంధించి అసలేం చెప్పింది? నెయ్యిగా చెప్పిన దానిని ఎలా తయారు చేశారని విశ్లేషించింది? ఆ నెయ్యిని వాడటం వల్ల ఆరోగ్యానికి వాటిల్లే నష్టం ఏమైనా ఉందా? లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా వినియోగించిన నెయ్యి పూర్తిగా కల్తీ అని పేర్కొన్న నేపథ్యంలో ఇదెంత హాని కలిగించేదన్న అంశాలపై ఫోకస్ చేస్తే.. విస్మయానికి గురి చేసే అంశాలు వెలుగు చూశాయి.

మొదటగా చెప్పాల్సింది.. సిట్ తన రిపోర్టులో జంతుకొవ్వు లేదని స్పష్టం చేసినప్పటికి.. ‘అత్యంత ప్రమాదకరమైన, ప్రణాళికాబద్ధమైన కల్తీ’ అన్న విషయాన్ని ప్రస్తావించిన అంశంపై వైసీపీ నేతలు ఇచ్చే వివరణ ఏమిటి? అన్నది మొదటి ప్రశ్న. జంతువుల కొవ్వు లేని కారణంగా అపవిత్రం కాలేదన్న వాదనలో పస లేదన్నది రెండో వాదన. ఎందుకంటే.. ఆగమ శాస్త్రం ప్రకారం.. హిందూ ధర్మశాస్త్రాలు.. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం పవిత్రత అన్నది కేవలం జంతు కొవ్వు లేకపోవటం మీదనే ఆధారపడి ఉండదని స్పష్టం చేస్తున్నారు.

స్వామివారికి సమర్పించే ప్రసాదం ద్రవ్యశుద్ధి అంటే.. ముడిపదార్థాల స్వచ్చత మీద కూడా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆగమశాస్త్రాల ప్రకారం స్వామివారికి సమర్పించే ప్రసాదంలో స్వచ్చమైన ఆవునెయ్యి మాత్రమే వాడాలి. సిట్ రిపోర్టు ప్రకారం.. లడ్డూ ప్రసాదంలో వాడింది ఆవునెయ్యి కాదు. అది రసాయనాలుచ వంట నూనెల మిశ్రమం అన్నది స్పష్టంగా పేర్కొనటం గమనార్హం.

ఆగమశాస్త్రం ప్రకారం నిషిద్దమైన, నకిలీ పదార్థాలు వాడటంతో సదరు ప్రసాదానికి ఉండాల్సిన సహజ పవిత్రత లోపించినట్లేనని పండితుల వాదన. భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో కల్తీ జరగటాన్ని మహా అపచారంగా పరిణిస్తారు. నెయ్యి పేరుతో రసాయనాలు వాడటం అనేది భక్తుల నమ్మకాన్ని మోసం చేయటమే. అంటే.. భక్తులనమ్మకాన్ని మోసం చేయటం కూడా కదా? అంటే.. అవి పవిత్రతకు భంగం కలిగించే అంశమే కదా? అన్నది ప్రశ్న. వీటికి సమాధానాలేంటి? అన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇక.. సిట్ రిపోర్టు ప్రకారం నెయ్యిగా చెప్పి వినియోగించిన ద్రవపదార్థాన్ని దేంతో తయారుచేశారు? అందులో ఉపయోగించిన రసాయనాలు.. వాటితో ఆరోగ్యానికి జరిగే నష్టం గురించి తెలిస్తే.. నోట మాట రాక మానదు. సిట్ సిద్ధం చేసిన 670 పేజీల తుది ఛార్జిషీట్ లో వనస్పతి, వంట నూనెలతో (పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్) తయారు చేశారు. నెయ్యి మాదిరి మంచి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాంటి కెమికల్స్ ను వినియోగించారు. పాలు, వెన్నె అన్నదే లేకుండా కృత్రిమ పద్దతిలో నెయ్యిని తయారు చేయటం మరో షాకింగ్ నిజం.

నెయ్యిని అచ్చం పాలతో తయారు చేసిన నెయ్యిలా కనిపించేందుకు సింథటిక్ కల్తీ చేపట్టారు. చౌకగా లభించే పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, వనస్పతిని బేస్ ఆయిల్ గా వాడారు. నెయ్యిలా కనిపించేందుకు బీటా కెరోటిన్ కానీ నిషేధిత సింథటిక్ రంగుల్ని వాడారని పేర్కొన్నారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యతగా ఉన్నట్లుగా చూపేందుకు మోనో డిగ్లజరైడ్స్ అనే రసాయనాన్ని కూడా వినియోగించారు.

మరి.. ఈ రసాయనాలతో తయారు చేసిన ద్రవపదార్థం (దాన్ని నెయ్యిగా పిలిస్తే)తో శరీరానికి జరిగే నష్టం ఎంత? వైద్య నిపుణులు ఏం చెబతున్నారు? అన్నది చూస్తే.. ఇదెంత ప్రమాదకరమన్నది అర్థమవుతుంది. ఈ నకిలీ నెయ్యిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తపోటు పెరిగేందుకు.. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కృత్రిమ రంగులు, రసాయనాలను శుద్ధి చేయటం కాలేయానికి భారంగా మారి.. దీర్ఘకాలంలో లివర్ ఫెయ్యిలూర్, కిడ్నీ సమస్యలకు దారి తీసే ముప్పు ఉంది.

సింథటిక్ నెయ్యి సహజ నెయ్యి మాదిరి అరగదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపులో మంట, వికారం, కడుపునొప్పి లాంటి లక్షణాలకు కారణమవుతుంది. వాసన కోసం వాడే కృత్రిమ రసాయనాలు శరీరంలో ఎండోక్రైన్ వ్యవస్థలపై ప్రభావాన్ని చూపి.. హార్మోన్ల లోపాలకు కారణమవుతుంది.కొన్ని రకాల సింథటిక్ రంగులు, ప్రిజర్వేటివ్స్ దీర్ఘకాలంలో శరీరంలో చేరిన కారణంగా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. ఇలా కల్తీ నెయ్యితో ఇన్ని ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉంటాయి. ఇదంతా తెలిసిన తర్వాత జంతుకొవ్వు లేనంత మాత్రాన పవిత్రమైనదని.. మనోభావాలు దెబ్బతినవన్న వాదనలో పస ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న.

Tags:    

Similar News