త్రివిక్రమ్ స్పీచ్ లో ఆ మాట మాదిరి కావలి ఎమ్మెల్యేకు ఎదురైంది

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గొప్పదనం గురించి ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటను ఆ తర్వాతి కాలంలో కొన్ని కోట్ల మంది కొన్ని వేల మంది వాడేసి ఉంటారు.;

Update: 2026-01-31 05:30 GMT

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గొప్పదనం గురించి ఒక సభలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటను ఆ తర్వాతి కాలంలో కొన్ని కోట్ల మంది కొన్ని వేల మంది వాడేసి ఉంటారు. సింధూరం సినిమా చివర్లో వచ్చిన మాటకు తాను రెండు చేతుల్ని జేబుల్లో పెట్టుకొని నడచుకుంటూ వెళ్లిపోయానని.. ఎక్కడికి వెళుతున్నానో కూడా తెలీదని.. అంతలా తనను ప్రభావితం చేసిందని చెప్పినట్లే.. ఇంచుమించు అలాంటి సిట్యుయేషన్ కావలి ఎమ్మెల్యేకు తాజాగా ఎదురైంది.

అవును.. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా.. ఒక మహిళ చెప్పిన మాటకు ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాకుండా.. రెండు చేతులు జోడించి.. నమస్కారం పెట్టి ముందుకు వెళ్లిపోయారు. కావలి ఎమ్మెల్యే దుగుమాటి క్రిష్ణారెడ్డి శుక్రవారం అధికారుల్ని వెంట పెట్టుకొని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కావలి పట్టణంలోని బాపూజీ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో అనుకోని రీతిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తమ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేను ఒక మహిళ ఎదురెళ్లి.. నమస్కారం పెట్టి సార్ .. మాకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వండని కోరారు. దీనికి స్పందించిన సదరు ఎమ్మెల్యే.. ఆమె నిలుచొని ఉన్న భవనాన్ని చూపిస్తూ.. ‘‘ఈ రెండు అంతస్తుల భవంతి.. మీ సొంతమేనామ్మా?’’ అని అడిగారు. అందుకు స్పందించిన సదరు మహిళ.. అవును సార్.. ఆ భవనం మాదే అని చెప్పారు.

దీంతో.. రెండు చేతులు జోడించి.. నమస్కారం తల్లి అంటూ ముందుకు వెళ్లిపోయారు. ఆయనతో ఉన్న అధికారులు.. టీడీపీ నేతలు నవ్వులు పూయించిన పరిస్థితి. దారిద్ర్య రేఖకు దిగువున నివసించే కుటుంబాలకు పరిమితం కావాల్సిన తెల్లరేషన్ కార్డులు కొందరు బహిరంగంగా డిమాండ్ చేస్తున్న వైనం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైందన్న మాట వినిపించింది. ఆమె నోటి నుంచి వచ్చిన మాటకు.. మారు మాట్లాడుకోకుండా వెళ్లిపోయిన కావలి ఎమ్మెల్యే పరిస్థితి త్రివిక్రమ్ చెప్పినట్లే ఉందని కొందరు మాట్లాడుకోవటం కనిపించింది.

Tags:    

Similar News