వారి పోటీతోనే కేసీఆర్ పరేషాన్...రేవంత్ సంచలన వ్యాఖ్యలు !
తెలంగాణా అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల మీద కీలక వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణా అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తనదైన పంచులతో సెటైర్లతో సభలో నవ్వులు పూయించారు. కేసేఅర్ ని పెద్ద మనిషి అంటూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళూ జీవించాలని ప్రతిపక్షంలోనే ఉంటూ తమ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకోవడం విశేషం.
ఆశ పడుతున్నారు పాపం :
ఇక బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితం అయిపోయారు అని దాంతో ఆ పార్టీలో నాయకత్వం పోటీ మొదలైంది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. హరీష్ రావు కేటీఆర్ లను ఉద్దేశించి ఒకరిని మించి ఒకరు పరుగులు పెడుతున్నారని అన్నారు. పొద్దునే ఒకరు ట్వీట్ చేస్తే తరువాత మరొకరు ప్రెస్ మీట్ పెడతారు అని ఒకాయన టూర్లకు పోతే మరోకాయన వెంబడే వెళ్తారని హరీష్ కేటీఆర్ ల మధ్య పోటీ ఇలా ఉందని పంచు డైలాగులు పేల్చారు. ఈ పోటీని చూసి పెద్దాయన కేసీఅర్ పరేషాన్ అవుతున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
పెద్దాయన గురించే బెంగ :
ఈ పోటీ మధ్య పెద్దాయన గురించే బెంగ అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అధ్యక్ష మీరైనా చెప్పాలి బీఆర్ఎస్ నేతలకు మంచి మాటలు అని కోరారు. అంతే కాదు పెద్దాయన కేసీఆర్ ఫాం హౌస్ వదిలి సభకు రావాలని ఈ పోటీకి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టించి సభలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. కేసీఅర్ ఆరోగ్యం విషయంలో బాగుండాలని తాము ఎంతో కోరుకుంటున్నామని కానీ ఆ పార్టీలో పోటీ వల్లనే ఏదైనా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ సాగుతోంది అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
అధికారం పార్టీ రెండూనూ :
బీఆర్ఎస్ నేతలకు ఇంకా అర్ధం కానిది ఒకటి ఉందని అధికారం పోయింది అలాగే పార్టీ కూడా పోయింది అన్నది వారు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పుని చేసి తమ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని ఆయన మండిపడ్డారు. లక్ష కోట్లకు పైగా వెచ్చించి మూడేళ్ళకు పైగా నిర్మాణం చేసిన కాళేశ్వరం కాస్తా కూలేశ్వరం అయింది అని ఎద్దేవా చేశారు. దాని వల్ల నీటి పారుదల రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఏమీ బాగుపడలేదని తేల్చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఏకంగా లక్షా 59 వేల మెట్రిక్ టన్నుల వడ్లను తెలంగాణాలో ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించామని రేవంత్ రెడ్డి చెప్పారు..
డెబిట్ మాత్రమే మీది :
తెలంగాణాను పదేళ్ళు పాలించి అప్పులు చేశారని బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముందు ఆ సత్యాన్ని వారు ఒప్పుకోవాలని చేసిన అప్పులకు తప్పులకు ప్రజలకు బాధ్యతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ రెండేళ్ళలో తాము చేసిన అభివృద్ధిని తమ క్రెడిట్ ఖాతాలో రాసుకుంటూ బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న విన్యాసాలను అంతా గమనిస్తున్నారు అని అన్నారు. పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చిందని తీరు మారకపోతే ఆ ఫలితమే అన్ని ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ఆయన హెచ్చరించారు.