చెవిరెడ్డి ఓకే... బూచేపల్లికి ప్రమోషన్.. ఒంగోలుపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు!!

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు, అందరు పాల్గొన్న ఇద్దరు నేతలు అందరి దృష్టిని ఆకర్షించారు.;

Update: 2026-03-17 17:30 GMT

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో మంగళవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఒంగోలు నియోజకవర్గం కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. ఈ నియోజకవర్గం సీనియర్ నేత, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహించినది కావడం అందరికీ తెలిసిందే. బాలినేని తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నడుమ జగన్ నిర్వహించిన సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండు రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు.

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు, అందరు పాల్గొన్న ఇద్దరు నేతలు అందరి దృష్టిని ఆకర్షించారు. వైసీపీలో అధికారంలో ఉన్నంతవరకు ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరించేవారు. ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారనే చర్చ ఇప్పటివరకు జరిగింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జిల్లా వ్యవహరాలు చూస్తారని అనుకున్నా, వయసు రీత్యా ఆయన గతంలో ఉన్నంత చురుగ్గా ఉండలేకపోతున్నారు. దీంతో జిల్లా బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది పార్టీ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.

అయితే మంగళవారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై మాజీ సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భవిష్యత్తులో పెద్ద పదవిలో ఉంటారని జగన్ చెప్పడం ద్వారా బాలినేని స్థానంలో బూచేపల్లి మాత్రమే జిల్లా పగ్గాలు చూస్తారని స్పష్టత ఇచ్చినట్లైందని అంటున్నారు. పార్టీ కోసం బూచేపల్లి చాలా కష్టపడుతున్నారని మాజీ సీఎం జగన్ ప్రశంసించారు. అన్నీ కలిసివస్తే భవిష్యత్తులో బూచేపల్లి ఉన్నత స్థానంలో ఉంటారని అధినేత వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలో వైసీపీ పార్టీలో బూచేపల్లికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం ఖాయంగా చెబుతున్నారు.

ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూటమి సునామీని తట్టుకుని ఆయన గెలిచారు. అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ వెన్నుచూపకుండా పోరాడుతున్నారని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలతో బూచేపల్లి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి చేపట్టడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలోనూ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఒక స్పష్టత ఇచ్చారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్టమెంటు నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి పోటీ చేశారు. అయితే ఇటీవల కొన్నిరోజులుగా ఆయనను ఒంగోలుకు దూరంగా ఉండమని జగన్ చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది.

చెవిరెడ్డి సొంత నియోజకవర్గమైన తిరుపతి జిల్లా చంద్రగిరికి మాత్రమే పరిమితం కావాలని, ఒంగోలు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జగన్ ఆదేశించారంటూ కొన్ని మీడియా గ్రూపుల్లో కథనాలు వస్తున్నాయి. చెవిరెడ్డికి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారానికి తాజాగా జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒంగోలు కార్యకర్తల సమావేశంలో చెవిరెడ్డికి భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఆయనను ఈ జిల్లా రాజకీయాల నుంచి వేరు చేయలేదని సంకేతాలు ఇచ్చినట్లైందని అంటున్నారు. చెవిరెడ్డి సైతం మీటింగులో హుషారుగా పాల్గొన్నారు. జగన్ తనను దూరం పెట్టారని మీడియాలో జరిగిన ప్రచారానికి ఈ సమావేశం ద్వారా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.

Tags:    

Similar News