మోడీ నివాసం వద్ద....మరో ఉద్యమానికి రెడీ !

దేశ రాజధానిలో ఉద్యమించాలన్నా లేదా నిరసనలు తెలియచేయాలన్నా జంతర్ మంతర్ వేదిక ఉంది.

Update: 2026-08-02 03:37 GMT

దేశ రాజధానిలో ఉద్యమించాలన్నా లేదా నిరసనలు తెలియచేయాలన్నా జంతర్ మంతర్ వేదిక ఉంది. అదే అతి పెద్ద ఆందోళనలకు మైదానంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ మధ్య సరికొత్త ఉద్యమ వేదికను కాంగ్రెస్ కనుగొంది. అదే మోడీ నివాసం. ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసం వద్దకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అంతా పెద్ద సంఖ్యలో చేరుకుని మెరుపు నిరసనలు చేశారు. దాంతో భద్రతా దళాలకు ఏమి జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు, కొన్ని గంటల పాటు సాగిన ఈ నిరసనలు పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకుల తరలింపుతో ముగిసాయి. అయితే ఈ సందర్భంగా తన ముక్కుకు గాయం అయింది అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఈసారి గట్టిగానే :

ప్రధాని నివాసం వద్ద ఆందోళనలు ఎవరూ చేయరు, కానీ కాంగ్రెస్ కొత్త సంప్రదాయాన్ని సృష్టించింది. దాంతో అది ఇపుడు ఆనావాయితీగా మారబోతోందా అంటే అవును అనే జవాబు వస్తోంది. అత్యంత పటిష్టతతో భద్రతా వలయంగా ఉండే ప్రధాని నివాసం వద్దకు ఈసారి మార్చ్ చేయడానికి ఆం ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయం స్పష్టం చేశారు. ఈ నెల 4న నరేంద్ర మోడీ నివాసం వరకూ మార్చ్ ని నిర్వహిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

పిటిషన్ తో కేజ్రీవాల్ :

ఈ మార్చ్ కానీ ఆందోళన కానీ ఎందుకు అంటే ఈ 20 పెట్రోల్ మీద కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలియచెప్పేందుకు అని ఆయన అంటున్నారు. ఈ 20 పెట్రోల్ మీద ప్రజలలో తీవ్ర స్థాయిలో ఆందోళన అసంతృప్తి ఉందని కేజ్రీవాల్ చెబుతున్నారు. దీని మీద ఆప్ పార్టీ ఆన్ లైన్ లో నిర్వహించిన సంతకాల సేకరణకు ఏకంగా రెండు లక్షల మంది ఇప్పటికే డిజిటల్ సంతకాలు చేశారని ఆయన చెప్పారు. దాంతో ఈ నెల నాలుగు నాటికి ఈ సంతకాల సంఖ్య మరింతంగా పెరుగుతుందని చెప్పారు. ఆ పిటిషన్ ని తీసుకుని వెళ్ళి నేరుగా ప్రధాని నివాసం దాకా మార్చ్ చేసి అనంతరం నరేంద్ర మోడీకే అందిస్తాను అని కేజ్రీవాల్ చెబుతున్నారు.

లాఠీ చార్జి జరిగినా :

ఆగస్టు 4న ఆప్ నాయకత్వంలో జరిగే నిరసనలో పెద్ద సంఖ్యలో జనాలు తన వెంట రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మరో వంద మంది కాయకర్తలతో కలసి మోడీ నివాసం దాకా మార్చ్ ని నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మోడీకి పిటిషన్ అందించి వస్తామని ఆయన చెప్పారు. అయితే ఈ మార్చ్ నేపథ్యంలో తమ మీద లాఠీ చార్జి జరిగినా తగ్గేది లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

డిమాండ్లు ఇవేనా :

ఇక కేంద్ర ప్రభుత్వం ఈ 20 పెట్రోల్ విషయంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చెశారు. వాహనదారులకు సాధారణ పెట్రోలు లేదా ఈ 20 ఈ రెండింటిలో ఏది కావాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఒక వేళ ఈ 20 పెట్రోల్ నే తప్పనిసరిగా చేయాలనుకుంటే మాత్రం అది సాధారణ పెట్రోల్ ధర కంటే తక్కువ ధరకే అందించాలని ఆయన రెండవ డిమాండ్ గా చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ 84 రూపాయల కంటే తక్కువకు చేయాలని మూడవ డిమాండ్ గా పెట్టారు. ఈ 20 పెట్రోల్ వల్ల ఆశించిన ప్రయోజనం అయితే కనిపించడం లేదని వాహనాల మైలేజ్ బాగా తగ్గుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఇంజన్ పనితీరు మీద ప్రభావం చూపిస్తోంది అన్నారు. రైతులకు కూడా దీని వల్ల పెద్దగా లాభం లేదని ఆయన విమర్శించారు. అందువల్ల ప్రజల మీద ఈ 20 పెట్రోల్ ని బలవంతంగా రుద్దడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News