ఏపీలో గ్యాస్ ఎన్ని రోజులకు సరిపోతుంది ?
ప్రస్తుతం భారత దేశాన్ని గ్యాస్ కొరత పట్టి పీడిస్తోంది. మెల్లగా హర్మూజ్ జలసంధి నుంచి దాటి ఒకటి రెండు భారతీయ్ ఓడలు గ్యాస్ తో దేశంలోకీ అడుగు పెడుతున్నాయి.;
ప్రస్తుతం భారత దేశాన్ని గ్యాస్ కొరత పట్టి పీడిస్తోంది. మెల్లగా హర్మూజ్ జలసంధి నుంచి దాటి ఒకటి రెండు భారతీయ్ ఓడలు గ్యాస్ తో దేశంలోకీ అడుగు పెడుతున్నాయి. కొంత వరకూ పరిస్థితి ప్రస్తుతానికి ఓకే అనుకున్నా మును ముందు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని నేపథ్యం ఉంది. దీంతో వివిధ రాష్ట్రాలు ఈ విషయంలో తగిన విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ రోజూ సమీక్ష చేస్తూ వస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అలెర్ట్ చేస్తూనే ఉన్నారు.
కలవరం వద్దు అంటూ :
ఇదిలా ఉండగా తాజా సమీక్షలో చంద్రబాబు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులలో కలసి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గ్యాస్ విషయం మీద చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని బాబు తెలియచేయడం ఏపీకి అతి పెద్ద ఊరటను కలిగించే పరిణామంగానే చూడాలి. అంతే కాదు మరి కొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని కూడా అంటున్నారు. ఇక రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని బాబు స్పష్టం చేయడం కీలక పరిణామం గా ఉంది.
వాటికి ప్రాధాన్యత :
ఇక ఏపీలో ఉన్న ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని బాబు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు ఇక మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని అంటూనే ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు కలవరపాటుకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత :
ఇక ఏపీలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలని బాబు అధికారులను ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపుతో పాటు మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలని బాబు దిశా నిర్దేశం చేశారు. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్ వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని కూడా కీలక ప్రతిపాదన చేశారు. అలాగే సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని ఆయన సూచించడం విశేషం. మొత్తం మీద చూస్తే ఏపీలో గ్యాస్ ప్రస్తుతానికి బాగానే అందుబాటులో ఉంది. ప్రజలు ఎవరూ ఈ విషయంలో దిగాలు పడాల్సింది లేదు, ఈ పద్నాలుగు రోజుల వ్యవధిలో యుద్ధానికి పరిష్కారం లభిస్తే అంతా హ్యాపీగానే ఉంటారు. ఏది ఏమైనా రానున్న రోజులలో యుద్ధం ముగిసిపోవాలని అంతా కోరుకుంటున్నారు.