గ్రౌండ్ లెవెల్ ఖాళీ...కూటమి నేతల హర్రీ
ఏపీలో 2024లో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఇరవై ఒక్క నెలలలో దాదాపుగా మెజారిటీ స్థానిక సంస్థలు అన్నీ కూటమి నాయకత్వం కిందకు వచ్చేశాయి.;
ఏపీలో 2024లో టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఇరవై ఒక్క నెలలలో దాదాపుగా మెజారిటీ స్థానిక సంస్థలు అన్నీ కూటమి నాయకత్వం కిందకు వచ్చేశాయి. వారూ వీరూ లేకుండా వైసీపీకి చెందిన అత్యధిక నేతలు అంతా కూటమి వైపు మొగ్గారు. దానికి వారు చెప్పిన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉంటే నిధులు వస్తాయి పనులు జరిగి అభివృద్ధి జనాలకు చూపించగలమని. చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టి మరీ మేయర్ పదవులు మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా కూటమి పార్టీ నేతలు అందుకున్నారు.
అంతా మాజీలు అయ్యారు :
ఇపుడు చూస్తే రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు పదవీ కాలం మార్చి 17తో పూర్తి అయింది. మార్చి 18 నుంచి అంతా మాజీలు అయిపోతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన కూడా మొదలు కాబోతోంది. ఏపీలో అనేక చోట్ల పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశాలు కూడా భావోద్వేగంతో సాగాయి. ప్రత్యేక అధికారుల చేతుల్లోకి పాలన వెళ్ళడంతో గ్రౌండ్ లెవెల్ లో అధికారం అంతా ఇపుడు కూటమి నేతల చేతుల్లో నుంచి మారిపోతోంది.
రాజకీయంగా ఖాళీ :
నిన్నటిదాకా స్థానికంగా అధికారాలు అందుకుంటూ పాలన సాగించిన కూటమి నేతలు అంతా ఇపుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. దాంతో ఎన్నికలు పెట్టేంతవరకూ వారు మాజీ నేతలుగానే ఉండాల్సి వస్తోంది. ఇంకో వైపు వైసీపీకి చెందిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వైసీపీ ఏపీలో ఘోరంగా ఓటమి పాలు అయినా గ్రౌండ్ లెవెల్ లో తమ పార్టీ ఇంకా అధికారంలో ఉంది అని చెప్పుకోవడానికి స్థానిక సంస్థలు కనిపించాయి. కానీ ఇపుడు వైసీపీ చూస్తే పట్టణాలలో పూర్తిగా అధికారం అన్నది లేకుండా పోతోంది ఏప్రిల్ 2తో పంచాయతీల పదవీ కాలం ముగియడంతో అక్కడ కూడా కూటమి వైసీపీ నేతల పదవీ కాలం పరిసమాప్తం అవుతోంది జూన్ వచ్చేటప్పటికి మండలాలు జిలా పరిషత్తులలో కూడా మాజీలు పెద్ద ఎత్తున కూటమి వైసీపీల నుంచి మిగులుతారు.
త్వరగా ఎన్నికలు :
ఆరు నెలల లోపల ఎన్నికలు స్థానిక సంస్థలకు పెడతామని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆరు నెలలు అంటే సెప్టెంబర్ దాకా అన్న మాట. అంతవరకూ మాజీలుగానే వీరంతా ఉండాల్సి ఉంది. ఇక కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అందరికీ నామినేటెడ్ పదవులు దక్కలేదు, దాంతో స్థానిక సంస్థల మీదనే చాలా మంది కర్చీఫ్ వేసి మరీ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే అంత తొందరగా తాము అధికారంలోకి వస్తామని వారు చూస్తున్నారు.
పొలిటికల్ గ్యాప్ :
ఇక పైన కూటమి ప్రభుత్వం ఉంది. దిగువన మాత్రం అధికారుల పాలన సాగుతోంది. దాంతో పొలిటికల్ గా ఒక గ్యాప్ అయితే ఏర్పడుతుంది అని అంటున్నారు. అధికారులు ప్రజల సమస్యల విషయంలో సక్రమంగా వ్యవహరించకపోయినా ఏ చిన్న తప్పు చేసినా అది ప్రభుత్వానికే చుట్టుకుంటుంది అని అంటున్నారు. మరో వైపు మాజీలు అయిన వారు జోష్ తగ్గి కాస్తా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు ఆరు నెలల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే బెటర్ అన్న మాట ఉంది. ఎన్నికలు ఎంత ఆలస్యం చేస్తే అంత ఇబ్బంది వస్తుందని కూడా అంటున్నారు ప్రస్తుతానికి అయితే కూటమి ఎన్నికలలో పోటీకి ఉత్సాహం కనిపిస్తోంది. వైసీపీ నుంచి చూస్తే కొంత వేచి చూస్తే వైఖరి కనిపిస్తోంది. కానీ ఈ ఏడాదిలో ఎన్నికలు పెట్టకపోతే మాత్రం వైసీపీ దూకుడు పెంచే చాన్స్ ఉంటుందని అంటున్నారు.