దళపతి సంచలనం: 'కింగ్ మేకర్ కాదు.. నేనే కింగ్'!
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కిపోతున్న సంగతి తెలిసిందే.;
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కిపోతున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు కూటముల మధ్య పోరుగానే ఉన్న తమిళనాడు ఎన్నికలు.. ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. అందుకు కారణం సినీ నటుడు, దళపతి విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ! ఈసారి ఎన్నికల్లో ఈ పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో విజయంపై విజయ్ ధీమా చర్చనీయాంశంగా మారింది.
అవును... ఓ పక్క అధికారంలో ఉన్న డీఎంకే+కాంగ్రెస్ కూటమి, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ+అన్నాడీఎంకే కూటమి. వీటిమధ్య బలమైన పొరు ఉండబోతుందని చెబుతోన్న వేళ.. తాజాగా టీవీకేతో విజయ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో... యువత, కొత్తగా ఓటు హక్కు సంపాదించినవారు, మహిళల్లో విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని.. అది కాస్తా ఓట్లుగా మారితే కచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం కన్ఫాం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవికే అధినేత విజయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా... తాను కింగ్ మేకర్ కాదని.. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని.. తాను కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతానని విజయ్ చెప్పారని అంటున్నారు. ఈ స్థాయిలో ఆయన ధీమా వ్యక్తం చేయడంతో పొత్తుల విషయంపైనా స్పష్టత వచ్చినట్లయ్యిందని చెబుతున్నారు.
వాస్తవానికి.. టీవీకే విజయ్ తో అన్నాడీఎంకే పొత్తుకు ప్రయత్నాలు చేసిందనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విజయ్ తో పొత్తు కోసం బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని, చేస్తుందని చెబుతున్నారు. మొదట్లో బ్రతిమాలి, తర్వాత భయపెట్టి పావులు కదిపిందంటూ ప్రచారమూ జరిగింది. అయితే ఈ విషయంలో తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ మరింత రాటుదేలారని.. ఆయన ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఫిక్సయ్యారని చెబుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కూడా టీవీకే విజయ్ తో పొత్తుపై ఆసక్తి కనబరిచాయని కథనాలొచ్చాయి. అయితే.. మెజార్టీ సభ్యులు మాత్రం డీఎంకే తో ఉన్న దీర్ఘకాల పొత్తుకే మొగ్గు చూపారని చెబుతున్నారు. దీంతో... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనేది ఆల్ మోస్ట్ కన్ఫాం అయిన పరిస్థితి! దీంతో... ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ... కచ్చితంగా మంచి నెంబర్ సాధిస్తే అది తమిళనాడు రాజకీయాలతో సరికొత్త అధ్యాయానికి నాంధి అయ్యే అవకాశలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.
కాగా... 234 ఎమ్మెల్యే స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే - 133, కాంగ్రెస్ - 17, వీసీకే - 4, సీపీఐ (ఎం) - 2, సీపీఐ - 2 సీట్లు సాధించగా... అన్నాడీఎంకే - 60, బీజేపీ - 4, పీఎంకే - 3 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.