అజిత్ పవార్ బ్రతికి ఉంటే ఫిబ్రవరి 12న కీలక పరిణామం!

మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-31 06:32 GMT

మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ... అజిత్ పవార్ బ్రతికి ఉంటే ఫిబ్రవరి 12న ఓ కీలక పరిణామం చోటు చేసుకునేదని వెల్లడించారు.

అవును... అజిత్ పవార్ మరణానంతరం మహా రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సతీమణి సునేత్రా పవర్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై స్పందించిన శరద్ పవార్... సునేత్రా పదవీ ప్రమాణ స్వీకారం గురించి తనకు తెలియదని.. ప్రపుల్ పటేల్, సునీల్ తటాకర్ వంటి కొంతమంది భవిష్యత్ కార్యచరణపై నిర్ణయాలు తీసుకోవడానికి చొరవ తీసుకుంటారు అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే గత నాలుగు నెలలుగా అజిత్ పవార్, జయంత్ పాటిల్, శశికాంత్ షిండే నేతృత్వంలో రెండు ఎన్సీపీ వర్గాల విలీనం గురించి చర్చలు జరుగుతున్నాయని శరద్ పవార్ తెలిపారు. ఈ క్రమంలో విలీనం తేదీ కూడా నిర్ణయించబడిందని.. అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఫిబ్రవరి 12న రెండు వర్గాలూ విలీనమయ్యేవని తెలిపారు. అయితే.. దురదృష్టవశాత్తు అజిత్ అంతకు ముందే తమను విడిచిపెట్టాడని.. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు శరద్ పవార్ వెల్లడించారు.

మరోవైపు.. శనివారం సాయంత్రం సునేత్రి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నరని అంటున్నారు. అదే జరిగితే.. ఆ పదవిని చేపట్టిన తొలిమహిళగా ఆమె నిలుస్తారు. ఇక ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.

కాగా... జూలై 2023లో ఎన్సీపీ చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఉన్న 54 మంది ఎమ్మెల్యేలలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తీసుకుని అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరిపోయారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో.. శరద్ పవార్ తన వర్గానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అని పేరు పెట్టారు.

బుధవారం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌ జెట్ 45 కూలిపోవడంతో అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విధిత్ జాదవ్, పైలట్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్, క్యాబిన్ సిబ్బంది సభ్యురాలు పింకీ మాలి సహా మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమయంలో ఈ విమాన ప్రమాదంపై మహారాష్ట్ర సీఐడీ విచారణ ప్రారంభించింది.

Tags:    

Similar News