మెరిసే అమెరికా కల వెనుక మరుగున పడుతున్న భావోద్వేగాలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడిట్' వేదికగా సదరు వ్యక్తి పంచుకున్న తన అంతర్మథనం అనేక మంది ఎన్‌ఆర్‌ఐల మనసుల్లోని మాటను ప్రతిబింబించింది.;
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడిట్' వేదికగా సదరు వ్యక్తి పంచుకున్న తన అంతర్మథనం అనేక మంది ఎన్‌ఆర్‌ఐల మనసుల్లోని మాటను ప్రతిబింబించింది. గత 17 ఏళ్లుగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేసి ప్రస్తుతం న్యూయార్క్‌లో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తన జీవితానికి ఒక కొత్త దిశ అవసరమని ఆయన భావించారు. అమెరికాలో అన్నీ ఉన్నా.. ఏదో వెలితి తనను వెంటాడుతోందని.. మనసుకి ప్రశాంతత కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్ణయానికి దారితీసిన ప్రధాన కారణాలు
ఈ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకోవడానికి వెనుక కొన్ని బలమైన సామాజిక, వ్యక్తిగత కారణాలు కనిపిస్తున్నాయి. విదేశీ గడ్డపై ఉద్యోగ వేటలో పడి కుటుంబంతో గడిపే నాణ్యమైన సమయం తగ్గిపోవడం ప్రధాన కారణం. తన మూడేళ్ల కుమారుడు కేవలం యాంత్రికమైన వాతావరణంలో కాకుండా భారతీయ సంస్కృతి, క్రీడలు, నైతిక విలువల మధ్య పెరగాలని ఆ తండ్రి ఆకాంక్షగా మారింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు.. పరాయి దేశంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంది..
పుణేలో కొత్త జీవితం
తిరిగి వచ్చిన తర్వాత నివసించడానికి ఆయన మహారాష్ట్రలోని పుణే నగరాన్ని ఎంచుకోవడం విశేషం. పుణేలోని కోరేగావ్ పార్క్ లేదా కళ్యాణి నగర్ వంటి ప్రాంతాల్లో రూ. 3-4 కోట్ల బడ్జెట్‌తో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం అక్కడి అంతర్జాతీయ స్థాయి వాతావరణం. కేవలం ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలిగే ఆయన భార్యకు ఆ ప్రాంతాలు సౌకర్యవంతంగా ఉంటాయని.. అలాగే పిల్లల చదువుకు కూడా పుణే ఒక విద్యా కేంద్రమని ఆయన నమ్మకం.
ఇది ఒక కొత్త ధోరణికి సంకేతమా?
ఈ ఘటన కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు.. ఇది ఒక సామాజిక మార్పును సూచిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒకప్పుడు అమెరికా అంటే కేవలం 'సెటిల్ అవ్వడం' అనే లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు భారత్‌లో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు ఎన్నారైలను స్వదేశానికి రప్పిస్తున్నాయి. భారత్ లో జీవన నాణ్యత మెరుగుపడటం.. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండాలనే భావోద్వేగ అవసరం అందరిలోనూ ఆలోచనలో పడేస్తోంది.
ఈ కారణాల వల్ల చాలా మంది యువ ప్రవాస భారతీయులు 'రివర్స్ మైగ్రేషన్' వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగినా, మనిషికి చివరికి కావాల్సింది మానసిక ప్రశాంతత, ఆత్మీయుల పలకరింపు అని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.
’డాలర్ల కన్నా బంధాలే మిన్న" అనే సందేశం ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. అమెరికా కల నెరవేర్చుకున్నాక కూడా మనసు భారతీయ మూలాల కోసం పరితపించడం సహజమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు ఇదే బాట పడతాయా? అన్నది వేచి చూడాలి.