అక్రమ వలసదారులకు అమెరికా భారీ ఆఫర్.. ఉచిత ప్రయాణం.. $2,600 బోనస్

అమెరికాలో అక్రమ వలసల సమస్య దశాబ్దాలుగా ఒక చిక్కుముడిలా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. అవి న్యాయపరమైన చిక్కుల్లో పడటం సర్వసాధారణం.;

Update: 2026-03-18 14:53 GMT

అమెరికాలో అక్రమ వలసల సమస్య దశాబ్దాలుగా ఒక చిక్కుముడిలా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. అవి న్యాయపరమైన చిక్కుల్లో పడటం సర్వసాధారణం. అయితే డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రవేశపెట్టిన “ప్రాజెక్ట్ హోంకమింగ్” గతానికి భిన్నంగా కనిపిస్తోంది. కేవలం ‘బలవంతపు బహిష్కరణ’ అనే పాత పద్ధతికి స్వస్తి పలికి ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ అనే సరికొత్త ఆర్థిక వ్యూహాన్ని తెరపైకి తేవడం గమనార్హం.

ఆర్థిక క్రమశిక్షణ.. మానవీయ కోణం

సాధారణంగా ఒక అక్రమ వలసదారుని గుర్తించి, నిర్బంధించి, సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత దేశం నుండి పంపించడానికి అమెరికా ప్రభుత్వానికి సగటున 18,245 డాలర్లు ఖర్చవుతుంది. ఇది అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే పెను భారం. దీనికి భిన్నంగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ప్రతిపాదించిన 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్ పథకం ఆర్థికంగా ఎంతో లాభదాయకమైనది. విమాన ప్రయాణ ఖర్చులతో కలిపి కేవలం 5,100 డాలర్లతో ఈ ప్రక్రియ ముగిసిపోవడం వల్ల ఒక్కో వ్యక్తిపై సుమారు 13,000 డాలర్ల పైగా ప్రజా ధనం ఆదా అవుతోంది. ఇది కేవలం వలసల నివారణే కాదు.. ఒక రకమైన 'కాస్ట్-ఎఫెక్టివ్' పరిపాలన అని చెప్పక తప్పదు.

సాంకేతికతతో పారదర్శకత

“సీబీపీ హోమ్” యాప్ ద్వారా ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం మరో కీలక అడుగు. అక్రమ వలసదారులు అంటేనే నేరస్తులనే ముద్ర వేయకుండా వారిని గౌరవప్రదంగా ‘సాధారణ ప్రయాణికుల’ మాదిరిగా పంపించడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన అనే విమర్శలకు తావు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ముఖ్యంగా భారతదేశంలోని తాజ్ మహల్ వంటి సాంస్కృతిక చిహ్నాలను ప్రచార చిత్రాల్లో ఉపయోగించడం ద్వారా ఆయా దేశాల పౌరులకు తమ మాతృభూమికి తిరిగి వెళ్లడం ఒక సానుకూల నిర్ణయమనే సందేశాన్ని పంపగలిగారు.

సవాళ్లు - వాస్తవాలు

2025 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 2.2 మిలియన్ల మంది ఈ పథకాన్ని ఎంచుకోవడం ఈ ప్రాజెక్ట్ సాధించిన ప్రాథమిక విజయానికి నిదర్శనం. అయితే ఈ గణాంకాలు ఎంతవరకు స్థిరంగా ఉంటాయనేది చూడాలి. కేవలం డబ్బు కోసమే వలసదారులు తిరిగి వెళ్తారా? లేదా అమెరికాలో ఉండటం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వేచి చూస్తారా? అనేది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ బలవంతపు అరెస్టులు, సరిహద్దుల్లో హింసాత్మక వాతావరణం కంటే ఇలాంటి ప్రోత్సాహకాలు శాంతియుత పరిష్కారానికి బాటలు వేస్తాయి.

ఏ దేశానికైనా సార్వభౌమాధికారం, సరిహద్దు భద్రత ప్రాధాన్య అంశాలు. అక్రమ వలసలను నియంత్రించడంలో అమెరికా అనుసరిస్తున్న ఈ ‘బిజినెస్ మోడల్’ తరహా పరిష్కారం ఇతర దేశాలకు కూడా ఒక పాఠం కాగలదు. కఠినత్వంతో కాకుండా వెసులుబాటుతో కూడిన ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా అమెరికా ప్రభుత్వం అటు ఖజానాను, ఇటు అంతర్జాతీయ ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. “ప్రాజెక్ట్ హోంకమింగ్” ఎంతవరకు సంపూర్ణ విజయం సాధిస్తుందనేది రాబోయే నెలల్లో తేలనుంది.

Tags:    

Similar News