ఆ 'సరదా'నే ఎంపీ కొంప ముంచిందా?!
మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు నలుగురి లో కలవడం.. నలుగురితో సరదాగా ఉండడం అలవాటని ఆయన కుటుంబం చెబుతోంది;
మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు నలుగురి లో కలవడం.. నలుగురితో సరదాగా ఉండడం అలవాటని ఆయన కుటుంబం చెబుతోంది. ఫస్ట్ టైమ్ ఎంపీ కావడంతోపాటు.. ఇలాంటి అలవాట్లు కూడా.. ఎప్పుడూలేవని చెబుతున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యం ఉన్న కుటుంబం నుంచి పుట్టా వచ్చారు. ఆయన తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. టీటీడీ చైర్మన్‌గా కూడా చేశారు.
ఇక, పుట్టా మహేష్ సొంత మామ.. యనమల రామకృష్ణుడు 40 ఏళ్లకుపైగానే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా రు. మంత్రిగా కూడా పనిచేశారు. ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్‌కు నిజంగానే చెడు అలవాట్లు ఉన్నట్టుగా ఎక్కడా ఇప్పటి వరకు లేదు. అయితే.. ఆయన తరచుగా అందరినీతోనూ కలివిడిగా ఉంటా రన్న పేరుంది. స్నేహితులను పెంచుకోవడం.. వారి కుటుంబాల్లో జరిగే ఫంక్షన్లలో పాల్గొనడం అంటే.. మహా సరదా అని చెబుతున్నారు.
ఇదే ఉద్దేశంతో ఆయన తాజాగా రోహిత్‌రెడ్డి ఇచ్చిన విందుకు కూడా హాజరయ్యారని ఒక టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని పుట్టా కూడా పదే పదే చెబుతున్నారు. సెల్ఫీ వీడియోలోను, అదేవిధంగా తాజాగా ఇచ్చిన ప్రకటనలోనూ ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అంటున్నారు. అయితే.. రోహిత్‌రెడ్డితో ఆయన పాల్గొన్న పార్టీపై విమర్శలు రావడం.. డ్రగ్స్ వినియోగించారన్న అభియో గం ఎదుర్కోవడంతో ఇప్పుడు చిక్కుల్లో పడాల్సి వచ్చింది.
వాస్తవానికి పుట్టా పనితీరును గమనిస్తే.. ఏలూరు ఎంపీగా ఆయన దూకుడుగానే ఉన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్లమెంటులోనూ.. మంచి గళం వినిపిస్తున్నారు. వివాద రహితుడిగా గత 22 మాసాలుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా సౌమ్యుడన్న పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీగా కూడా పేరుంది. కానీ, ఆ చిన్న సరదానే ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయనపై మరకలు పడేలా చేసింది. ఈ విషయంలో పార్టీ పరంగా.. కూడా ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. చివరకు ఏం చేస్తారో చూడాలి.