సర్వే: తమిళనాట 'విజయ్'దే హవా!
తమిళ వెట్రి కళగం(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన నటుడు, దళపతి విజయ్ ప్రభావం ఏముంటుందిలే! అనుకున్న వారికి తాజాగా వచ్చిన సర్వే భారీ షాకిచ్చింది.;
తమిళ వెట్రి కళగం(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన నటుడు, దళపతి విజయ్ ప్రభావం ఏముంటుందిలే! అనుకున్న వారికి తాజాగా వచ్చిన సర్వే భారీ షాకిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో జరగనున్న ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే దాదాపు 15-18 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న సర్వే ఫలితం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. వాస్తవానికి కొత్త పార్టీలకు తమిళులు పెద్దగా ఆసక్తి చూపరు అనే నానుడి ఉంది.
గతంలో కమల్ హాసన్ సహా.. పలువురు కొత్త పార్టీలు పెట్టుకున్నా ఒకటి రెండు స్థానాలకే పరిమితం అయ్యారు. కమల్ పార్టీ అయితే.. గత ఎన్నికల్లోపూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలానే విజయ్ పార్టీ టీవీకే కూడా భారీ పరాభవం మూటగట్టుకుంటుందని అంచనా వేసుకున్నారు. కానీ, మాస్ జనాలు సహా యూత్‌లో విజయ్‌కు భారీ ఫాలోయింగ్ ఉందని.. ఆయనకు గ్రామీణ ప్రాంతంలో పట్టు పెరిగిందని తాజాగా సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో ఇప్పుడు పార్టీలన్నీ విజయ్ పేరుస్మరించే పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా విజయ్ కు మైనస్ అవుతుందని అనుకున్న `వివాహేతర సంబంధం` ఇప్పుడు ప్లస్ అయినట్టు సర్వేలు చెబుతున్నాయి. దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని, కేవలం విజయ్‌లో ఉన్న ధైర్యం.. తమకు ఏదైనా చేస్తాడన్న ఆశలు మాత్రమే కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు.. విజయ్ చివరి సినిమా విడుదల కాకుండా నిలిచిపోవడం.. కరూర్ దుర్ఘటనలు వంటివాటిపై ఆయనను వేధిస్తున్నారన్న చర్చ సామాన్యుల్లో పెరిగిందని కూడా సర్వే చెప్పడం గమనార్హం.
ఈ పరిణామాల క్రమంలో కీలకమైన బీజేపీ, డీఎంకేలు.. ఇప్పుడు విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా బీజేపీ విజయ్ కోసం అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తోందని అంటున్నారు. ఉపముఖ్యమంత్రి పీఠం నుంచి 100 - 140 సీట్ల వరకు విజయ్‌కు ఇవ్వడంతోపాటు.. ఇతరత్రా కీలక సాయాలు చేసేందుకు కూడా బీజేపీఅగ్ర నాయకులు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా.. ఇప్పుడు విజయ్ కీలక పాత్ర పోషించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కానీ, విజయ్ మాత్రం ఒంటరిపోరుకే రెడీ అవుతున్నట్టు సమాచారం.