'మూసీ'పై మాట‌ల యుద్ధం: బీఆర్ఎస్ వాకౌట్‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో మూడోరోజు కూడా.. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది.;

Update: 2026-03-18 14:43 GMT

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో మూడోరోజు కూడా.. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ప్ర‌ధానంగా మూసీ ప్ర‌క్షాళ‌న వ్య‌వ‌హారంపై ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ప్ర‌భుత్వం త‌ప్పులు చెబుతోంద‌ని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించ‌గా.. వారికి అర్ధం చేసుకోవ‌డంలో లోపం ఉంద‌ని అధికార ప‌క్షం పేర్కొంది. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం.. బీఆర్ఎస్ స‌భ్యులు స‌భ‌నుంచి వాకౌట్ చేశారు.

ఏం జ‌రిగింది?

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అంశంపై స‌భ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు. దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం తొలిద‌శ ప‌నుల‌కు డీపీఆర్ అందింద‌ని.. సుమారు 7 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిపారు. అంతేకాదు.. ప్ర‌క్షాళ‌న తొలిద‌శ‌లో 1400ల‌కు పైగా నిర్మాణాల‌ను తొల‌గించాల్సి ఉంటుంద‌ని.. వాటిలో అర్హులైన వారికి పున‌రావాసం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ముఖ్యంగా బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న‌వారిని ఆదుకుంటామ‌న్నారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారంపైనే మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అస‌లు డీపీఆర్ సిద్ధ‌మే కాలేద‌ని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాల‌ను ఆయ‌న చూపించారు. అంచనా వ్యయం విషయంలోనూ స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దీనిని పూర్తి చేసేందుకు ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పార‌ని.. ఇప్పుడు తొలిద‌శ, మ‌లిదశ అంటూ.. ఎన్నిద‌శ‌ల‌కు విస్త‌రిస్తున్నారో కూడా అర్ధంకావ‌డం లేద‌ని అన్నారు.

తాము మూసీ ప్ర‌క్షాళ‌న‌కు వ్య‌తిరేకం కాద‌ని తెలిపారు. కానీ, మూసీ పేరుతో జ‌రుగుతున్న అక్ర‌మాల‌కు మాత్ర‌మే తాము వ్య‌తిరేక‌మ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పాకిస్థాన్‌లో నిషేధించిన కంపెనీని ఇక్క‌డ‌కు ఎందుకు తీసుకువ‌చ్చార‌ని ప్ర‌శ్నించారు. నిజంగానే మంత్రి చెబుతున్న‌ట్టుగా మూసీకి సంబంధించిన‌ డీపీఆర్ రెడీ అయితే సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.అంతేకాదు.. అస‌లు అప్పు ఇ చ్చేందుకు ఏడీబీ(ఆసియా అభివృద్ది బ్యాంకు) కూడా స‌న్న‌ద్ధంగా లేద‌ని.. కానీ, స‌భ‌లో మాత్రం త‌ప్పులు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.

దీనికి మంత్రి శ్రీధ‌ర్‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. తెలుసుకుని మాట్లాడాల‌ని అన్నారు. ప్ర‌భుత్వం రూపాయి కూడా అవినీతి పాల్ప‌డ‌డం లేద‌న్నారు. ఏడీబీ రుణం ఇచ్చేందుకు ముందు వ‌చ్చింద‌ని.. విష‌యాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేటీఆర్‌.. త‌న స‌భ్యుల‌తో క‌లిసి స‌భ నుంచి వాకౌట్ చేశారు.

Tags:    

Similar News