జంతుకొవ్వు లేదు సరే.. కల్తీ మాటేంటి సామీ?

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని తాజాగా సిట్ బృందం తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని వైసీపీ హైలెట్ చేస్తోంది.;

Update: 2026-01-31 04:28 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని తాజాగా సిట్ బృందం తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని వైసీపీ హైలెట్ చేస్తోంది. జంతు కొవ్వు లేదు కానీ కల్తీ జరిగిందన్న విషయాన్ని విస్పష్టంగా చెబితే.. ఆ అంశాన్ని వదిలేసిన వైసీపీ నాయకులు జంతు కొవ్వు లేకపోవటానని పదే పదే ప్రస్తావించటం ద్వారా చర్చకు మరో దిశగా తీసుకెళ్లేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. ఇదంతా చూసినప్పుడు జంతుకొవ్వు లేకున్నా రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం పూర్తిగా కల్తీనే కదా? అన్నదిప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

అంతేకాదు.. వైసీపీ వర్గాలు లడ్డూ పవిత్రత గురించి ప్రశ్నలు సంధించటం ద్వారా.. తమ ప్రభుత్వ హయాంలో అపవిత్రం కాలేదన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇక్కడే పెద్ద తప్పు చేస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన ఆవునెయ్యి ఏ మాత్రం నాణ్యమైనది కాదని.. అదంతా పూర్తి రసాయనాలతోనూ.. పామాలిన్ తోనూ తయారు చేసిన విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నప్పుడు.. పవిత్రమన్న వాదనను వినిపించే అవకాశం లేనట్లే.

అయినప్పటికి తన పిడివాదనతో విషయాన్ని డైవర్టు చేయాలన్న వైసీపీ వర్గీయుల వాదనకు పెద్ద ఆదరణ కలిగింది లేదు. అదే సమయంలో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని.. కానీ సిట్ రిపోర్టులో అలాంటివేమీ లేవని తేల్చిన మీదట వారు దోషులుగా బోనులో నిలబెట్టే ప్రయత్నం చేయటం.. పవిత్రమంటూ వారిద్దరూ చేసిన వ్యాఖ్యలే ఆ దేవదేవుడి భారీగా నష్టం కలిగించాయని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని సూత్రీకరించిన వైనం కామెడీగా మారిన పరిస్థితి.

ఎందుకంటే.. నాణ్యమైన నెయ్యి కాకుండా కల్తీ నెయ్యి వాడారన్న విషయం విస్పష్టంగా పేర్కొన్నప్పుడు లడ్డూ ప్రసాదం పవిత్రమన్న విషయాన్ని వైసీపీ నేతలు ఎలా చెప్పగలుగుతారు? ఆగమ శాస్త్రం ప్రకారం లడ్డూ పవిత్ర మొత్తం దానిలో ఉపయోగించే వస్తువుల నాణ్యత మీద ఉంటుందని స్పష్టం చేసిన వేళ.. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి పూర్తిస్తాయి కల్తీ అని తేల్చినప్పుడు అపవిత్రమే అవుతుంది కదా?

ఈ లాజిక్ అన్నది సామాన్య ప్రజలకు ఉండదని వైసీపీ నేతలు భావిస్తున్నారా? అందుకే.. అసలు విషయాన్ని వదిలేసి కొసరు విషయాన్ని పట్టుకోవటం ద్వారా ప్రజలు తమను ఆదరిస్తారని..తమ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన తప్పులేమీ జరగలేదన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఓవైపు కల్తీ జరిగిందని చెప్పినా.. అందుకు భిన్నంగా వైసీపీ వర్గాలు మొదలు పెట్టిన చర్చ ద్వారా లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి నాణ్యతపై ప్రశ్నలు తెర మీదకు వస్తాయన్నది మర్చిపోకూడదు. జంతుకొవ్వు లేకున్నా.. అసలుసిసలైన నెయ్యి కూడా కాదన్నది ప్రజలు గుర్తిస్తారు కదా? అలాంటప్పుడు పవిత్రత మీద వైసీపీ మాట్లాడేందుకు నైతికత ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న. అందుకే.. ఈ అంశంపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదన్న దానిపై మరింత మేధోమధనం చేయాల్సిన అవసరం వైసీపీ మీద ఉంది. లేకుంటే బ్యాక్ ఫైర్ కావటం ఖాయం. ఆ విషయాన్ని వైసీపీ అధినాయకత్వం గుర్తించిందా?

Tags:    

Similar News