వైసీపీలో హీట్ పెంచిన షర్మిల

వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ ప్రధాన టార్గెట్ ఎపుడూ టీడీపీనే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో మూడు పార్టీలుగా టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి.;

Update: 2026-03-19 18:21 GMT

వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ ప్రధాన టార్గెట్ ఎపుడూ టీడీపీనే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో మూడు పార్టీలుగా టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి. అఫ్ కోర్స్ పెద్ద పార్టీ టీడీపీనే. ప్రభుత్వంలోనూ సింహ భాగం వాటా ఆ పార్టీనే. పైగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది బాబు కాబట్టి వైసీపీ బాబునే టార్గెట్ చేస్తుకుంటోంది. అపుడపుడు జనసేన మీద కామెంట్స్ చేసినా బీజేపీని అయితే ఏమీ అనదు, ఇదీ వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ. అయితే ఏపీలో చూస్తే విపక్షంలో మరి కొన్ని పార్టీలు ఉన్నాయి. అవి వైసీపీతో పాటు కాంగ్రెస్, ఉభయ వామ పక్షాలు. వైసీపీ కాంగ్రెస్ మీద కూడా ఏనాడు కామెంట్స్ చేయదు, కామ్రేడ్స్ తో సైతం అదే తీరు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న షర్మిల మీద వైసీపీ రాజకీయ విమర్శలు చేయడానికి చూస్తోంది. అది అనివార్యమైన పరిస్థితినా లేక మరోటా అన్నది పక్కన పెడితే వైసీపీకి టీడీపీ రాజకీయంగా ప్రత్యర్ధి అయితే వైసీపీలో పొలిటికల్ హీట్ ని పెంచుతోంది మాత్రం కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల కావడమే విశేషం.

షర్మిల హాట్ కామెంట్స్ :

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కచ్చితంగా అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని షర్మిలా తాజాగా చేసిన హాట్ కామెంట్స్ వైసీపీని ఒక్కసారిగా కుదిపేశాయి. అంతే కాదు జగన్ లాంటి అన్న ఎవరికీ ఉండకూడదని అన్న అన్న మాటకే ఆయన కలంకం అంటూ పెద్ద పదమే షర్మిల వాడారు, దాంతో వైసీపీలో ఒక్కసారిగా షర్మిల విమర్శలు కదిపి కుదిపేశాయి. ఆ వెంటనే వరసబెట్టి వైసీపీ నేతలు ఇచ్చిన కౌంటర్లు అయితే అంతే వాడిగా వేడిగా సాగాయి. ఒక వైపు ఉగాది పండుగ వేళ రాష్ట్రమంతా ఉత్సాహంగా ఉంటే వైసీపీలో కీలక నేతలు అయితే మీడియా ముందుకు వచ్చి షర్మిల మీద తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.

ఆమె చెవులకు వినిపిస్తోందా :

కడప జిల్లా పులివెందులకే చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అయితే షర్మిల మీద గట్టిగానే మాటలతో ఎటాక్ చేశారు. షర్మిల లాంటి చెల్లెలు ఎవరికీ ఉండరాదని జనమంతా అనుకుంటున్నారని ఆ సంగతి ఆమె చెవులకు వినిపిస్తోందా అని ప్రశ్నించారు. ముప్పయ్యేళ్ళ క్రితమే షర్మిలకు పెళ్ళి అయితే జగన్ ఆస్తులలో వాటా ఎలా వస్తుందని లాజిక్ పాయింట్ తీశారు. వైఎస్సార్ తన ఆస్తులలో షర్మిలకు ఏనాడో వాటాలు ఇచ్చారని అవి జగన్ కంటే ఎక్కువని కూడా వివరాలతో లిస్ట్ చదివారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్మాణాత్మకమైన బాధ్యతలు చేయాలని సూచించారు. ఆమె వ్యక్తిగత అజెండాతో ముందుకు సాగుతున్నారని ఎత్తి చూపించారు.

వైఎస్సార్ కుటుంబం మీదనే :

వైఎస్ షర్మిల ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలతో వైఎస్‌ కుటుంబ గౌరవాన్ని దిగజార్చారని మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాచమల్లు శివ ప్రసాద రెడ్డి విమర్శించారు. జగన్ మీద ఆయన సొంత చెల్లెళ్ళు కామెంట్స్ చేయడం శోచనీయమని అన్నారు. ప్రత్యర్ధులకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకే షర్మిల సునీత ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక తెలంగాణాకు చెందిన కొండా రాఘవరెడ్డి కూడా తాను వైఎస్సార్ భక్తుడిని అని చెబుతూ షర్మిల చేస్తున్న విమర్శలు దారుణం అని మీడియా ముఖ్యంగా ద్వజమెత్తారు.

విమర్శల ప్రభావం కడప జిల్లాలో :

మొత్తం మీద చూస్తే షర్మిల పెట్టిన ఒక ప్రెస్ మీట్ తో వైసీపీలో వేడి పుట్టింది. పైగా వీరంతా 2029 దాకా మాజీ మంత్రి వివేకా హత్య కేసుని సాగదీయడానికే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రభావం తీవ్రంగానే పడింది. దాంతో కడప జిల్లాలోనే వైసీపీ దారుణంగా దెబ్బ తింది. నాడు షర్మిల విమర్శలను లైట్ తీసుకోవడం వల్లనే ఇలా జరిగింది అని ఇపుడు మాటకు మాటగా వైసీపీ బదులిస్తోంది. అయితే వైఎస్సార్ కుటుంబంలో అన్నా చెల్లెలు చేసుకుంటున్న పరస్పర విమర్శలు ప్రతి విమర్శల ప్రభావం కడప జిల్లాలో ఈసారి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News